
హృతిక్ శౌర్య హీరోగా రవి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓటు’. చాలా విలువైనది అనే ట్యాగ్ లైన్‌తో ఫ్లిక్ నైన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. తన్వినేగి హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. శనివారం ఈ మూవీ టీజర్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటో టైటిల్‌లోనే తెలుస్తుంది. ఓటుకు డబ్బులు అడుక్కునే స్థాయికి దిగజారిపోయే పరిస్థితి ఉన్న సమాజాన్ని వెన్నుతట్టి లేపాల్సిన అవసరం ఉంది. అందుకు ఇలాంటి సినిమాలు రావాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘మందుకు, నోటుకు ఓటు అమ్ముకోవడం కరెక్ట్ కాదు’ అనే కథాంశంపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’ అని చెప్పాడు హృతిక్ శౌర్య. ‘ఇదొక చక్కని సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అంది తన్వి. గోపరాజు రమణ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.