
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారికి ఓటర్ కార్డు టెన్షన్ పట్టుకుంది. ఐదేళ్ల కిందట వచ్చిన అప్లికేషన్లను రెండు రోజులుగా అధికారులు పరిశీలిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారులు అద్దెకు ఉంటున్న ఇండ్లకు వెళ్లి ఆధార్, రేషన్, ఓటర్ఐడీ కార్డులను చెక్‌చేస్తున్నారు. అయితే అప్లై చేసుకునే టైంలో అధికారులు ఓటర్ఐడీ మినహా అన్ని వివరాలు తీసుకున్నారు. ప్రస్తుతం చేస్తున్న సర్వేలో ఓటర్‌కార్డు అడుగుతుండడంతో ఇల్లు వస్తుందో లేదోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మొదట్లోనే అడగకుండా ఇప్పుడు ఎందుకు తప్పనిసరి అంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చి అద్దెకు ఉంటున్నవారు మరింత టెన్షన్ పడుతున్నారు. కాగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను రెవెన్యూ అధికారులు చూడాల్సి ఉండగా, లక్షల్లో దరఖాస్తులు రావడంతో ఆ పనిని జీహెచ్ఎంసీ సిబ్బందికి అప్పగించారు. బల్దియా బిల్ కలెక్టర్లే దరఖాస్తుదారుడి వివరాలు సరిగ్గా ఉన్నాయా?లేదా అని చెక్‌చేస్తున్నారు. ఓటర్, ఆధార్, రేషన్ కార్డుల వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల నుంచి మొత్తం 6 లక్షల20వేల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొందరు మ్యానువల్‌గా కలెక్టర్ ఆఫీసుల వద్ద, మిగిలినవారు మీసేవల ద్వారా అప్లై చేసుకున్నారు. ఇన్నాళ్లు ఇల్లు ఎప్పుడిస్తారో అని ఎదురు చూసిన జనం, ఓటర్‌కార్డు మెలికతో అస్సలు ఇల్లు వస్తుందా అనే ఆలోచనలో పడ్డారు.
అప్లికేషన్ల ఏరివేతకేనా?
దరఖాస్తుదారుల ఇండ్ల వద్దకు వస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది గతంలో ఏదైనా వివరాలు ఎంటర్చేయకపోతే వాటిని ఆవాస్ యాప్ లో అప్ లోడ్ చేస్తున్నారు. ఓటర్ ఐడీ కార్డు వివరాలు తప్పనిసరి అని సేకరిస్తున్నారు. ఓటర్ ఐడీ ఎపిక్ నంబర్‌తోపాటు నియోజకవర్గాన్ని ఎంట్రీ చేస్తున్నారు. అయితే ఓటర్‌ఐడీలు సేకరిస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్లో లక్ష ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటివరకు 90,172 ఇండ్ల నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి చేశారు. అయితే వచ్చిన 6.20లక్షల అప్లికేషన్లలో ఇతర జిల్లాల వారు ఉంటే వాటిని ఆయా జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఉన్న ఇండ్లకు సరిపడా మాత్రమే లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అప్లికేషన్ల ఏరివేత కోసమే సర్వే మొదలుపెట్టినట్లు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల్లో వ్యతిరేకత ఉండొద్దని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొదట కొల్లూరు ఇండ్ల అప్పగింత
దరఖాస్తుదారుల వివరాలు పరిశీలన పూర్తయిన వెంటనే కొల్లూరులోని డబుల్బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓటర్ ఐడీ కార్డులు సేకరిస్తున్నది ప్రధానంగా వీటికోసమే సమాచారం. బల్దియా సిబ్బంది పొద్దున నుంచి సేకరిస్తున్న వివరాలను సాయంత్రానికి డిప్యూటీ కమిషనర్లకు పంపుతున్నారు. వారి నుంచి జిల్లా కలెక్టర్లకు వివరాలు వెళ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఇండ్లను లబ్ధిదారులకు అందిస్తే తమకు లబ్ధి చేకూరుతుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బల్దియా సిబ్బంది ఆందోళన
అయితే రెవెన్యూ అధికారులు చేయాల్సిన పనిని తమతో చేయిస్తున్నారంటూ బల్దియా సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, క్యాస్ట్ తదితర వివరాలపై తమకు అవగాహన ఉండదని, ఇంటి ట్యాక్స్ కు సంబంధించి ఏదైన పనులు ఉంటే తమతో చేయిస్తే బాగుటుందని అంటున్నారు. ఐదేండ్ల కిందట తీసుకున్న అప్లికేషన్లను ఇప్పుడు పరిశీలించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని, అంతా అద్దె ఇండ్లలో ఉండేవాళ్లు కావడంతో గతంలో పెట్టిన అడ్రస్‌లలో ఎవరూ ఉండట్లేదని చెబుతున్నారు. అందరిని ఫోన్ చేసి అడ్రస్‌లకు పిలవాల్సి వస్తోందని బాధపడుతున్నారు.