సర్ ఎఫెక్ట్.. గ్రేటర్పైనే పార్టీల ఫోకస్!..ఆ 26 నియోజకవర్గాలపైనే దృష్టి

సర్ ఎఫెక్ట్.. గ్రేటర్పైనే పార్టీల ఫోకస్!..ఆ 26 నియోజకవర్గాలపైనే దృష్టి
  • 1.12 కోట్ల ఓటర్లు 
  • 34 శాతం జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోనే
  • వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన వారితో పాటు భారీగా సెటిలర్లు
  • 2002 లిస్టుతో పోల్చినప్పుడు ఓటర్ల మ్యాపింగ్ 60 శాతం లోపే
  • ఓటర్ల జాబితాలో భారీ మార్పు చేర్పులకు చాన్స్​ 
  • ఆ 26 నియోజకవర్గాలపైనే అధికారులు, రాజకీయ పార్టీల దృష్టి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఓటర్​ లిస్టు ప్రక్షాళనకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేయడంతో, రాష్ట్ర రాజకీయాల ఫోకస్ అంతా ఒక్కసారిగా గ్రేటర్ తో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధి దాకా ఉన్న నియోజకవర్గాలపై పడింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.35 కోట్ల ఓటర్లు ఉండగా, కేవలం వీటి పరిధిలోని 26 నియోజకవర్గాల్లోనే ఏకంగా 1.12 కోట్ల మంది దాదాపు 34 శాతం ఓటర్లు కేంద్రీకృతమై ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నియోజకవర్గాల అంతర్గత ఓటర్ల సరళిని పరిశీలిస్తే.. ఉపాధి, ఉద్యోగాల కోసం వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన వారితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన సెటిలర్ల జనాభా ఇక్కడ అత్యంత కీలకంగా మారింది.

ఇప్పటికే 2002 ఓటర్ల జాబితా మ్యాపింగ్ ఈ ప్రాంతాల్లో 60 శాతం లోపే పూర్తయినట్లు తెలుస్తున్నది. ఉమ్మడి జిల్లాలైన మహబూబ్‌‌నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వలస వచ్చిన లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్, అంబర్‌‌పేట్ ప్రాంతాలలో స్థిరపడ్డారు. అలాగే ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వ్యాపారులు, కార్మికులు గోషామహల్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, కార్వాన్ నియోజకవర్గాల్లో భారీగా ఉండగా, పాతబస్తీ పరిధిలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌‌పురా, బహదూర్‌‌పురా, మలక్‌‌పేట్, నాంపల్లి స్థానాల్లో ఒకే వర్గం ఓటర్లు ఉన్నారు. ఏపీ రాయలసీమ, కోస్తా ప్రాంతాల నుంచి వలస వచ్చిన సెటిలర్ల ప్రభావం కూకట్‌‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, సనత్‌‌నగర్, పటాన్‌‌చెరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల జయాపజయాలను శాసించే స్థాయిలో ఉంది. దీంతో సర్ చేపడితే ఈ ఓట్లు ఉంటాయా? గ్రామాల్లో ఇటు పట్టణాల్లో నమోదు చేసుకున్నవి.. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో రెండేసి ఓట్లు ఉన్నవారి వివరాలు ఎలా మ్యాచ్ చేస్తారు? కాకపోతే అలాంటి ఓట్లు ఎన్ని తొలగిపోతాయో అన్నది ఆసక్తికరంగా మారింది. 

ఆ డాక్యుమెంట్లు లేకపోతే ఎట్లా?

గ్రేటర్ పరిధిలో క్షేత్రస్థాయిలో ఉన్న ఓటర్ల వాస్తవ పరిస్థితులకు, ఓటర్ల జాబితాకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నది. సర్ ప్రక్రియలో గత 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుతం ఉన్న ఓటర్ల వివరాలను పోల్చి చూసినప్పుడు ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కనీసం 60 శాతం లోపే నమోదైనట్లు అధికారిక క్షేత్రస్థాయి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఉపాధి, వ్యాపారాల రీత్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గ్రేటర్, ఓఆర్ఆర్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌‌మెంట్లలో స్థిరపడిన వారే ఇక్కడ అత్యధికంగా ఉన్నారు. వీరిలో చాలామందికి ఇక్కడ ఇండ్లు లేకపోవడం లేదా అప్పటికి అసలు ఓటు హక్కే రాకపోవడంతో, ప్రస్తుత డిజిటల్ స్క్రీనింగ్‌‌లో వీరి డేటా 2002 రికార్డులతో లింక్ కావడం లేదు. 

దీనివల్ల 1987 తర్వాత 2004 తర్వాత జన్మించిన ఇక్కడి స్థానిక యువత, ఐటీ, ఇతరత్రా ఉద్యోగులు తాము దొంగ ఓటర్లం కాదని నిరూపించుకోవడానికి దశాబ్దాల క్రితం నాటి తమ తల్లిదండ్రుల పౌరసత్వ రుజువులు, పాత ఓటర్ కార్డులు లేదా మున్సిపల్ బర్త్ సర్టిఫికెట్లను వెతికి పట్టుకోవాల్సి వస్తోంది. ఎన్నికల సంఘం విధించిన పుట్టిన సంవత్సరాల కట్-ఆఫ్ నిబంధనల ప్రకారం 1987 జులై 1 కంటే ముందు జన్మించిన వారు ఆధార్, ఎస్ఎస్‌‌సీ మెమో వంటి సొంత పత్రాలు చూపిస్తే సరిపోతుంది కానీ, 1987 జులై 1 నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించిన వారు తమ సొంత పత్రాలతో పాటు ఆనాడు తమ తల్లిదండ్రులలో ఒకరు భారత పౌరుడిగా ఉన్నట్లు రుజువు చేసే పాత ఓటర్ ఐడీ లేదా బర్త్ సర్టిఫికెట్లను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. 

అలాగే 2004 డిసెంబర్ 2 తర్వాత జన్మించిన యువత తమ సొంత డాక్యుమెంట్లతో పాటు, పుట్టిన సమయానికి తల్లిదండ్రులిద్దరూ భారత పౌరులని లేదా ఒకరు అక్రమ వలసదారు కాదని నిరూపించే పౌరసత్వ ఆధారాలను తప్పనిసరిగా సమర్పించాల్సి వస్తోంది. ఉపాధి కోసం దశాబ్దాల క్రితమే ఇక్కడికి వలసవచ్చి, తరచూ అద్దె ఇండ్లు మారడం వల్ల పాత రికార్డులను భద్రపరచని బతకనికి వచ్చినోళ్లు, వలసదారులు, ఉద్యోగులు, స్థానిక కుటుంబాలకు క్షేత్రస్థాయి బీఎల్ఓలు నోటీసులు ఇస్తుండటంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ డాక్యుమెంట్లను దశాబ్దాల నాటి తల్లిదండ్రుల ఆధారాలను వెతికి పట్టుకోలేక, నిజమైన స్థానిక ఓటర్లు సైతం తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

ఒకవైపు అనుకూల ఓట్లు.. ఇంకోవైపు బోగస్ ఓట్లు

24 ఏండ్లలో ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రాంతాలైన మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, నిజాంపేట్, ప్రగతినగర్ లలో జనాభా విపరీతంగా పెరిగినప్పటికీ, దానికి అనుగుణంగా ఓటర్ల చిరునామాల మార్పు, నూతన నమోదు ప్రక్రియలు పూర్తిస్థాయిలో జరగలేదు. పాత చిరునామాలతోనే వేలాది మంది ఓటర్లు కొనసాగుతుండటం, ఒకే డోర్ నంబర్‌‌పై పదుల సంఖ్యలో ఓట్లు నమోదవ్వడం, అద్దె ఇండ్లు మారిపోయిన వారి ఓట్లు పాత బూత్‌‌లలోనే ఉండటం వంటి సాంకేతిక లోపాలు రాజకీయ పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారాయి. 

దీంతో ఓటర్ల జాబితాలో భారీ ఎత్తున మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఈసీ అధికారులు అంచనా వేస్తున్నారు. బీఎల్ఓలు నేరుగా ఓటర్ల ఇండ్లకు వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుండటంతో లక్షలాది తప్పుడు ఓట్లు తొలగిపోయే చాన్స్ ఉంది. అదే సమయంలో అసలు ఓటర్లకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం పొంచిఉన్నది. దీంతో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌‌లో తమ అనుకూల ఓట్లను కాపాడుకునేందుకు, ప్రతికూల బోగస్ ఓట్లను తొలగించేందుకు ప్రధాన పార్టీల నేతలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. 

ఈసీ లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో 36,62,835 ఓటర్లు, మేడ్చల్ జిల్లాలో 29,49,251 ఓటర్లు, హైదరాబాద్ జిల్లాలో 46,24,192 మంది ఓటర్లు ఉన్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలోని శేరిలింగంపల్లి (7.65 లక్షలు), ఎల్బీనగర్ (6.06 లక్షలు), కుత్బుల్లాపూర్ (7.34 లక్షలు), కూకట్‌‌పల్లి (4.86 లక్షలు), మహేశ్వరం (5.64 లక్షలు), ఉప్పల్ (5.43 లక్షలు), మల్కాజిగిరి (5.13 లక్షలు), రాజేంద్రనగర్ (6.19 లక్షలు) వంటి స్థానాలు రాష్ట్రంలోనే పెద్ద నియోజకవర్గాలుగా అవతరించాయి. ఈ భారీ ఓటు బ్యాంకే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో  రాజకీయ పార్టీలకు ప్రధాన హాట్ టాపిక్‌‌గా మారింది.