
ఉత్తర్ ప్రదేశ్లో ఏడు దశల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడుతున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్లో అధికారం చేపట్టేందుకు 202 సీట్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ఓటర్లు ఈసారి కూడా బీజేపీకే అధికారం కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ స్థానాలను బీజేపీ మిత్రపక్షాలు సొంతం చేసుకుంటాయని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి.
న్యూస్ 18
న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ప్రకారం యూపీలో బీజేపీ మరోసారి అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మిత్రపక్షాలతో కలిసి ఆపార్టీ 262 నుంచి 277 నియోజకవర్గాల్లో విజయఢంకా మోగించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కమలదళం మళ్లీ అధికారం చేపట్టే అవకాశమున్నట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. ఇక మిగతా పార్టీల విషయానికొస్తే ఎస్పీ, ఆర్ఎల్డీ కూటమి 119 నుంచి 134, బీఎస్పీ 7 నుంచి 15 స్థానాల్లో గెలుపొందే అవకాశముంది.
ఈటీజీ రీసెర్చ్
ఈటీజీ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్ గమనిస్తే రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి 230 నుంచి 245 స్థానాల్లో గెలుపొందే అవకాశముంది. సమాజ్వాదీ పార్టీ 150 నుంచి 165 సీట్లు, బీఎస్పీ 5 నుంచి 10 స్థానాల్లో విజయం సాధించనుండగా.. కాంగ్రెస్ పార్టీ 2 నుంచి 6 స్థానాలకు పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఇతరులు 2 నుంచి 6 స్థానాలు గెల్చుకునే ఛాన్సుంది.
న్యూస్ ఎక్స్
న్యూస్ ఎక్స్ అంచనా ప్రకారం ఈసారి ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ కూటమి 211 నుంచి 225 సీట్లలో విజయం సాధించనుంది. ఎస్పీ 140, బీఎస్పీ 17, కాంగ్రెస్ 4 స్థానాల్లో గెలుపొందనుంది.
పోల్స్ట్రాట్
పోల్స్ట్రాట్ లెక్కల ప్రకారం బీజేపీ కూటమి 211 నుంచి 225, ఎస్పీ 116 నుంచి 160, బీఎస్పీ 14 నుంచి 24, కాంగ్రెస్ 4 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించనున్నాయి.