
- కాంగ్రెస్ నేతల కామెంట్లపై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ ఆందోళన
జోధ్ పూర్: ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితే భారత్‌కు కూడా వస్తుందంటూ కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షిద్, మణిశంకర్ అయ్యర్ ఇటీవల చేసిన కామెంట్లపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం జోధ్‌పూర్‌లో రాజస్థాన్ హైకోర్టు ప్లాటినం జూబ్లీ వేడుకల సందర్భంగా ధన్ ఖడ్ మాట్లాడారు. పొరుగుదేశంతో మన దేశాన్ని ఇలా పోల్చడం షాకింగ్ గా ఉందన్నారు. ‘‘అందరూ జాగ్రత్తగా గమనించండి. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు భారత్‌లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు కామెంట్ చేయడం ఆందోళనకరమైన విషయం. ఈ దేశ పౌరుడు, పార్లమెంట్ సభ్యుడైన ఒక వ్యక్తి.. విదేశాంగ శాఖలోనూ పని చేసిన మరో వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమైన విషయం” అని ఖుర్షిద్, అయ్యర్‌లపై ధన్ ఖడ్ పరోక్షంగా మండిపడ్డారు.
కొన్ని దేశ వ్యతిరేక శక్తులు తమ చర్యలను దాచేందుకు లేదా న్యాయబద్ధమని చెప్పుకునేందుకు మన రాజ్యాంగ సంస్థలు, వేదికలను వినియోగించుకుంటున్నాయని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ అన్ని అంశాల కంటే దేశమే ప్రథమ ప్రాధాన్యం కావాలని ఆకాంక్షించారు. కాగా, మంగళవారం ఓ బుక్ రిలీజ్ ఫంక్షన్లో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో అంతా నార్మల్ గా ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా బంగ్లాదేశ్ లో మాదిరిగా జరగవచ్చు” అని అన్నారు. ఈ కామెంట్లను అయ్యర్ కూడా సమర్థించారు. అయితే, అదే వేదికపై ఉన్న కాంగ్రెస్ నేత శశిథరూర్ మరునాడు దీనిపై స్పందించారు. ఖుర్షిద్ మాటలను తాను వివరించలేనని చెప్పారు.