ఎస్ఎఫ్ఐ నేషనల్ ప్రెసిడెంట్​గా వీపీ సాను..83 మందితో కొత్త జాతీయ కమిటీ

ఎస్ఎఫ్ఐ నేషనల్ ప్రెసిడెంట్​గా వీపీ సాను..83 మందితో కొత్త జాతీయ కమిటీ

హైదరాబాద్,వెలుగు: భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నేషనల్ ప్రెసిడెంట్ గా వీపీ సాను, జనరల్ సెక్రటరీగా మయూక్ బిశ్వాస్ తిరిగి ఎన్నికయ్యారు. మొత్తం 83 మందితో కొత్త కమిటీ ఎన్నికైంది. వారిలో 19మంది ఆఫీస్ బేరర్స్​గా ఎలెక్ట్​ అయ్యారు. జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి నలుగురికి చాన్స్ వచ్చింది. ఉస్మానియా వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ 17వ జాతీయ మహాసభలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేషనల్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నేషనల్ వైస్ ప్రెసిడెంట్లుగా నితీశ్​ నారాయణ్ (ఢిల్లీ సెంటర్), ప్రతికుర్ రెహ్మాన్​ (బెంగాల్), తాళ్ల నాగరాజు(తెలంగాణ), అశోక్ (ఏపీ)​, అనుశ్రీ (కేరళ), సంగీతా దాస్(అస్సాం), సహాయ కార్యదర్శులుగా దినిత్ డెంట, దిప్పితాధర్ (ఢిల్లీ సెంటర్), శ్రీజన్ భట్టాచర్య (బెంగాల్), పీఎం అశ్రో (కేరళ), సందీపన్ దాస్ (త్రిపుర), ఆదర్శ్ ఎం.సాజీ(సెంటర్) ఎన్నికయ్యారు.

కార్యదర్శివర్గ సభ్యులుగా నిరుబన్ చక్రవర్తి (తమిళనాడు), ఐషీ ఘోష్ (ఢిల్లీ), సుభాశ్​ జక్కర్ (రాజస్థాన్), అమత్ ఠాకూర్ (హిమాచల్ ప్రదేశ్)ను ఎన్నుకున్నారు. తెలంగాణ నుంచి నాగరాజు, ఆర్ఎల్​మూర్తి, ఎం.పూజ, మమత, శివదుర్గారావు(హెచ్​సీయూ)కు కమిటీలో చోటు లభించింది. సభకు 28 రాష్ట్రాల నుంచి 68 మంది సెంట్రల్​ కమిటీ సభ్యులు, 634 మంది ప్రతినిధులు, 20 మంది అబ్జర్వర్లు అటెండ్ అయ్యారు. నాలుగు రోజుల పాటు జరిగిన మహాసభల్లో 35 తీర్మానాలను ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యావిధానానికి ప్రత్యామ్నాయంగా ఎస్ఎఫ్ఐ ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్రాఫ్ట్​పై మహాసభలో చర్చించారు. దీనిపై మరిన్ని అభిప్రాయాలు సేకరించి, కేంద్రానికి అందించనున్నట్టు ఎస్ఎఫ్ఐ నేతలు ప్రకటించారు.