వీఆర్ఏలకు పే స్కేల్ ఇయ్యలే..

వీఆర్ఏలకు పే స్కేల్ ఇయ్యలే..

జేపీఎస్​లకు జీతం పెంచలే అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనలు గాలికి..  
హైదరాబాద్, వెలుగు: వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని, జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులతో సమానంగా జీతాలిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. పీఆర్సీ ప్రకారం పెంచిన జీతాలు వచ్చే నెల ఫస్టుకు క్రెడిట్ అవుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో మిగతా ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషంలో ఉండగా.. వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలతోపాటు 2018 జులై తర్వాత ఉద్యోగాల్లో చేరిన సుమారు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నారు. తమకు పీఆర్సీతో ఫాయిదా లేదని, వచ్చే నెల నుంచే రెగ్యులర్ పే స్కేల్ అమలు చేయాలని వీఆర్ఏలు, జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ప్రభుత్వాన్ని కోరుతుండగా.. ప్రభుత్వం రిజల్ట్స్, పోస్టింగ్స్ ఇవ్వడంలో జాప్యం కారణంగానే తాము పీఆర్సీకి అనర్హులమయ్యామని, అందుకే తమకూ పీఆర్సీని వర్తింపజేయాలని 2018 జులై తర్వాత ఉద్యోగాల్లో చేరిన ఎంప్లాయ్స్ డిమాండ్ చేస్తున్నారు. 
వీఆర్ఏలకు పే స్కేల్ హామీకి నాలుగున్నరేళ్లు.. 
రెవెన్యూ శాఖలో గ్రామ స్థాయిలో డ్యూటీ చేస్తున్న 22 వేల మంది వీఆర్ఏల ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని, పే స్కేల్ వర్తింపజేస్తామని 2017 ఫిబ్రవరి 24న ప్రగతి భవన్​లో హామీ ఇచ్చారు. కానీ పే స్కేల్ ఇవ్వకుండా రూ.6,500 వేతనాన్ని రూ.10,500కు పెంచారు. ఆ తర్వాత రెగ్యులరైజేషన్ మాట మరిచారు. 2020 సెప్టెంబర్​లో వీఆర్వో వ్యవస్థ  రద్దుపై అసెంబ్లీలో మాట్లాడుతున్న సందర్భంలో మినిమం పే స్కేల్ వర్తింపజేస్తామని ప్రకటించారు. రూ.250 కోట్లు భారం పడుతుందని చెప్పారు. కానీ 9 నెలలు దాటినా ఆ హామీ నెరవేరలేదు. తాజాగా  పీఆర్సీ ప్రకారం 30% వేతన పెంపు వీఆర్ఏలకు వర్తిస్తుందని జీవోలో పేర్కొన్నారు. దీంతో ఒక్కొక్కరికి సీనియార్టీని బట్టి  రూ.13 వేల నుంచి రూ.14 వేల వరకు వచ్చే అవకాశముంది. అయితే గౌరవ వేతన పెంపు వద్దని, రూ.19 వేల మినిమం పే  స్కేల్ వర్తింపజేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 
జేపీఎస్​లకు జీతాలు పెంచలే.. 
ఉపాధి హామీ, పల్లె ప్రగతి, హరితహారం తదితర కార్యక్రమాల నిర్వహణ కోసం జేపీఎస్​లు రోజుకు 12 గంటలు గ్రామాల్లోనే ఉంటున్నారు. చేసిన పనికి తగిన వేతనం లేదని, రూ.15 వేల జీతం సరిపోవడం లేదనే ఆవేదన చెందుతున్నారు. వారు ఉద్యోగాల్లో చేరి రెండేళ్లయినా ఇంకా ప్రొబేషనరీ పిరియడ్​లోనే ఉన్నారు. దీంతో వారికి పీఆర్సీ వర్తించే చాన్స్ లేదు. వీరి ప్రొబేషనరీ పిరియడ్​ను అవసరమైతే నాలుగేళ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో 9,355 మంది జేపీఎస్‌‌లు ఆందోళన పడుతున్నారు. ఏప్రిల్ నుంచే రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులతో సమానంగా జీతాలిస్తామని సీఎం ప్రకటించినప్పటికీ.. రెండు నెలలైనా అమలు కాకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు.