ఎమ్మెల్యే నల్లమోతును అడ్డుకొని వీఆర్ఏల నిరసన

ఎమ్మెల్యే నల్లమోతును అడ్డుకొని వీఆర్ఏల నిరసన
  • ప్రభుత్వం జీతం ఆపేయడంతో ఆర్థిక ఇబ్బందులు 
  • సమ్మె చేస్తున్నా సర్కార్ పట్టించుకుంటలేదని మనస్తాపం 
  • హడావుడిగా పోస్టుమార్టం చేయించి అంత్యక్రియలకు పోలీసుల ప్రయత్నం 
  • ఎమ్మెల్యే నల్లమోతును అడ్డుకొని వీఆర్ఏల నిరసన  
  • నల్గొండ జిల్లా ఉట్లపల్లిలో ఘటన 

మిర్యాలగూడ, వెలుగు: రాష్ట్రంలో మరో వీఆర్ఏ ఆత్మహత్య పాల్పడ్డాడు. సమ్మె చేస్తున్నారన్న కారణంతో సర్కార్ జీతం ఆపేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై సూసైడ్ చేసుకున్నాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లికి చెందిన కంచర్ల వెంకటేశ్వర్లు (40), భవానీ దంపతులు. వీరికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. పెద్ద బిడ్డ ప్రీతికి పెండ్లి కాగా, చిన్న బిడ్డ శ్రీవిద్య ఇంటర్ చదువుతోంది. ఉట్లపల్లి వీఆర్ఏగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పేస్కేల్ పెంచాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెలో పాల్గొంటున్నాడు. అయితే సమ్మె చేపట్టిన వీఆర్ఏలకు సర్కార్ జీతాలు ఆపేసింది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం, సర్కార్ పేస్కేల్ అమలు చేస్తుందో లేదోనని వెంకటేశ్వర్లు మనస్తాపానికి గురయ్యాడు. దీనికి తోడు ఆరోగ్యం బాలేకపోవడంతో మరింత కుంగిపోయాడు. శనివారం కుటుంబసభ్యులు రేషన్ షాపునకు వెళ్లిన టైమ్లో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  

ప్రభుత్వ తీరుతోనే సూసైడ్: వీఆర్ఏలు 
వెంకటేశ్వర్లుకు నివాళి అర్పించేందుకు ఉట్లపల్లికి చేరుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​ రావును వీఆర్ఏలు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి, వీఆర్ఏలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని 48 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతోనే వెంకటేశ్వర్లు సూసైడ్​ చేసుకున్నాడని వాపోయారు. వీఆర్ఏల తీరుపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. బాధిత ఫ్యామిలీకి రూ.10 వేలు అందజేశారు.  

పూడ్చిపెట్టేందుకు గుంత తీయించిన పోలీసులు.. 
వెంకటేశ్వర్లు డెడ్ బాడీని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, హడావుడిగా పోస్టుమార్టం చేయించారు. అక్కడి నుంచి డెడ్ బాడీని ఉట్లపల్లికి తరలించారు. వీఆర్ఏలు సమ్మె చేస్తుండడంతో ఈ విషయం బయటకు రాకుండా త్వరగా అంత్య క్రియలు చేయించాలని పోలీసులు ప్రయత్నించారు. డెడ్ బాడీని పూడ్చిపెట్టేందుకు జేసీబీతో గుంత కూడా తీయించారు. విషయం తెలిసి వివిధ పార్టీల లీడర్లు, కుటుంబసభ్యులు పోలీసులపై మండిపడ్డారు. దీంతో వాళ్లు గుంత పూడ్చివేయించారు. మున్సిపల్​ ఫ్లోర్​లీడర్ ​లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్​లు వెంకటేశ్వర్లుకు నివాళి అర్పించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని లక్ష్మారెడ్డి డిమాండ్​ చేశారు. అనంతరం బాధిత ఫ్యామిలీకి రూ.50 వేల సాయం ప్రకటించారు. కాగా, వెంకటేశ్వర్లు తల్లిని అడిగే గుంత తీయించామని పోలీసులు చెప్పారు.