సీనియారిటీ, అర్హతలను పట్టించుకుంటలే

సీనియారిటీ, అర్హతలను పట్టించుకుంటలే
  • డ్రైవర్లు, రికార్డ్​ అసిస్టెంట్లుగా మరికొందరు..
  • జీవో నంబర్​ 121కు విరుద్ధంగా సర్కార్​ పోస్టింగ్​లు
  • సీనియారిటీ, అర్హతలను పట్టించుకుంటలే  
  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇస్తామన్న ప్రభుత్వం  
  • అంత కంటే తక్కువ కేడర్ లో నియమించడంపై వీఆర్వోల ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత దాదాపు రెండేండ్లకు సర్కార్ చేపట్టిన వీఆర్వోల సర్దుబాటు ప్రక్రియ వివాదాస్పదమైంది. వీఆర్వోలు ముందు నుంచి ఆందోళన చెందుతున్నట్లుగానే పోస్టింగ్స్ లో సీనియారిటీ, అర్హతలను పట్టించుకోలేదు. వీఆర్వోలను జూనియర్ అసిస్టెంట్ లేదా దానికి సమానమైన హోదా కలిగిన ఉద్యోగంలో సర్దుబాటు చేస్తామని జీవో ఇచ్చిన ప్రభుత్వం.. వాళ్లకు ఆ స్థాయి పోస్టులు మాత్రం ఇవ్వలేదు. కొందరికి స్టోర్ కీపర్లు, డ్రైవర్లుగా, మరికొందరికి రికార్డు అసిస్టెంట్లుగా పోస్టింగ్ ఇచ్చింది. అటెండర్ ఉద్యోగానికి ఎక్కువ.. జూనియర్ అసిస్టెంట్ కు తక్కువ కేడర్ పోస్టులో నియమించడంపై వీఆర్వో సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్వోలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం జులై 23న జీవో నెంబర్ 121 విడుదల చేసింది. ఈ నెల 1న లాటరీ పద్ధతిలో వారికి వివిధ శాఖలు కేటాయించారు. ఈ సందర్భంగా విద్యార్హతలు, సీనియారిటీ వంటి అంశాలను పట్టించుకోలేదని అప్పట్లోనే వీఆర్వో సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు జాబ్​లో చేరకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కానీ కోర్టుకు వెళ్లకుండా తమకు కేటాయించిన శాఖలో చేరిన వీఆర్వోలకు పోస్టింగ్స్ లో అన్యాయం జరిగింది. జీవోలో చెప్పినట్లుగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులో కాకుండా దాని కన్నా తక్కువ కేడర్ పోస్టులో వారికి ఉద్యోగాలిచ్చారు. 

కాలేజీల్లో రికార్డు అసిస్టెంట్లుగా.. 

ములుగు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వీఆర్వో ఎస్కే షరిఫాకు, ఏటూరు నాగారం డిగ్రీ కాలేజీలో వీఆర్వోలు పి.బానయ్య, టి.విజయలక్ష్మికి రికార్డు అసిస్టెంట్లుగా పోస్టింగ్ ఇస్తూ కాలేజీ ఎడ్యుకేషన్ ఆర్జేడీ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే కొల్లాపూర్ డిగ్రీ కాలేజీలో చిలుకా రాఘవేందర్ రెడ్డికి, అమ్రాబాద్ జీడీసీలో దారా గణేశ్ కు, కల్వకుర్తి జీడీసీలో గంధం రాములుకు, నాగర్ కర్నూల్ జీడీసీలో సీర్ల బాలనారాయణకు రికార్డు అసిస్టెంట్లుగా పోస్టింగ్ ఇచ్చారు. మంచిర్యాల వుమెన్స్ డిగ్రీ కాలేజీలో డి.శ్రీనివాస్ కు స్టోర్ కీపర్ గా, ముకుందరావుకు రికార్డు అసిస్టెంట్ గా, అసిఫాబాద్ డిగ్రీ కాలేజీలో డి.మహేందర్ కు రికార్డు అసిస్టెంట్ గా పోస్టింగ్ ఇచ్చారు. ఖమ్మం జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో దొబ్బల చంద్రశేఖర్ ను స్టోర్ కీపర్ గా నియమించారు. లాటరీలో విద్యాశాఖకు అలాట్ అయిన వీఆర్వోల్లో చాలామందికి అన్ని జిల్లాల్లో ఇలాంటి పోస్టింగ్సే రావడం గమనార్హం.

డ్రైవింగ్ రాని మహిళకు డ్రైవర్ పోస్టు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వీఆర్వో సోయం విజయలక్ష్మి.. కలెక్టర్ తీసిన లాటరీలో విద్యాశాఖకు అలాట్ అయ్యారు. ఆ శాఖలో డ్రైవర్ పోస్టు మాత్రమే ఖాళీగా ఉండడంతో ఆమెను అదే పోస్టులో సర్దుబాటు చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి ప్రభుత్వ శాఖలో డ్రైవర్ పోస్టుకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. విజయలక్ష్మికి కనీసం టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. కానీ ఆమెకు డ్రైవర్ పోస్టు కేటాయించారు.