వీఆర్వోలకు డ్యూటీల్లేవ్​!

వీఆర్వోలకు డ్యూటీల్లేవ్​!

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో వీఆర్వో సిస్టమ్​ రద్దయి ఏడాది దాటిపోయింది. కానీ, వీఆర్వోలను మాత్రం సర్కారు పట్టించుకోవడం లేదు. వీఆర్వోలుగా పనిచేసిన 5,345 మందిని పంచాయతీరాజ్​ వంటి డిపార్ట్​మెంట్లకు ట్రాన్స్​ఫర్​ చేస్తామని నిరుడు సెప్టెంబర్​లో సర్కారు గెజిట్​ రిలీజ్​ చేసినా.. ఇంతవరకు దానిపై స్పందించలేదు. అర్హతను బట్టి జూనియర్​ అసిస్టెంట్​, సీనియర్​ అసిస్టెంట్లుగా వాళ్లకు ప్రమోషన్​ ఇస్తామన్న ప్రకటన కూడా కేవలం మాటలకే పరిమితమైంది. దీంతో ఒక్క డిపార్ట్​మెంట్​ అని కాకుండా రకరకాల పనులను వీఆర్వోలతో చేయించుకుంటున్నారు. టీఎస్​పీఎస్సీ ద్వారా జాబ్స్​ పొందిన 2 వేల మంది వీఆర్వోల ప్రొబేషన్​ పీరియడ్​ పూర్తయి రెండేండ్లు దాటుతున్నా రెగ్యులరైజ్​ చేయలేదు. 20 ఏండ్లుగా పనిచేస్తున్నోళ్లకు ప్రమోషన్లూ రాలేదు. వేరే శాఖల ఉద్యోగులకు అందుతున్న ఇంక్రిమెంట్లు, ఇతర బెనిఫిట్ల వంటివేవీ వీఆర్వోలకు అందట్లేదు.  

జాబ్​ చాప్టరే లేదు

వీఆర్వో సిస్టమ్​ రద్దు కాకముందు.. పల్లెల్లో రెవెన్యూ రికార్డులను దాచడం, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ​వంటి పథకాల అమలు వంటి పనులతో వీఆర్వోలకు జాబ్​ చాప్టర్​ ఉండేది. ఇప్పుడు జిల్లాల్లో అక్కడి అవసరాలను బట్టి రెవెన్యూ, ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ల అధికారులు ఎలాంటి జాబ్​ చాప్టర్​ లేకుండానే వేర్వేరు పనులను అప్పగిస్తున్నారు. ‘‘పెద్దాఫీసర్లకు ఏ అవసరమొచ్చినా మేమే పనిచేయాల్సి వస్తోంది. ఎవరెప్పడు పిలుస్తారో.. ఒకేసారి ఎంతమంది ఏ పనులు చెప్తారో అర్థం కావట్లేదు. పాత పహాణీలకు సంబంధించిన అనుమానాలున్నాయని ఆఫీసర్ల నుంచి ఫోన్​ వస్తే అర్ధరాత్రిళ్లు కూడా వెళ్లిన సందర్భాలున్నాయి’’ అని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వీఆర్వో ‘వెలుగు’తో తన బాధను పంచుకున్నారు.  

రకరకాల డ్యూటీలు

వీఆర్వోలను రకరకాల పనులకు అధికారులు వాడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో వీఆర్వోలుగా పనిచేసినోళ్లకు ఎయిర్​పోర్టులో డ్యూటీ వేస్తున్నారు. వంతుల వారీగా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల దాకా డ్యూటీలు ఇస్తున్నారు. అక్కడ ఇంటర్నేషనల్​ ప్యాసింజర్లు కరోనా టెస్టులు చేయించుకున్నారా? లేదా? వ్యాక్సినేషన్​ వంటి విషయాలను పరిశీలిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోలు సెంటర్ల దగ్గర అధికారులకు హెల్పర్లుగా పని చేస్తున్నారు. హైదరాబాద్​, రంగారెడ్డి వంటి జిల్లాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చూడటం, కబ్జాదారులకు నోటీసులు అందించడం వంటి పనులు చేస్తున్నారు. తహసీల్దార్​కు వచ్చే వివిధ ఫిర్యాదులనూ వీళ్లే పరిశీలిస్తున్నారు. కొన్నిచోట్ల తహసీల్దార్లు, కలెక్టర్లకు మధ్య మెసెంజర్లుగా ఫైళ్లు మోస్తున్నారు.  

ఊరికిపోతే అవమానం

‘‘ఏడాది నుంచి ఆఫీసర్లు మాకు వేర్వేరు పనులను చెప్తున్నారు. సిస్టమ్​ రద్దయ్యాక వేరే పనులు మీద ఊళ్లకు పోతే.. ‘మీ నౌకర్​ పోయింది కదా.. మళ్లెందుకొచ్చిన్రు’ అంటూ అనుమానిస్తున్నారు. కొంతమంది ఇబ్బందిగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు’’ అని మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన నరసింహ అనే ఓ వీఆర్వో ఆవేదన వ్యక్తం చేశారు.  

మంత్రులకు ఏడాదిగా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకుంటలే

మా డ్యూటీలు చెప్పాలని, డిపార్టుమెంట్​ అలాట్​మెంట్​పై తేల్చాల్సిందిగా అధికారులను అడిగితే ‘నెలనెలా జీతాలిస్తున్నం కదా.. ఏం చెప్తే అది చేయండి’ అంటున్నరు. సమస్యలు పరిష్కరించాలని మంత్రులు హరీశ్​​రావు, శ్రీనివాస్​ గౌడ్​లు, సీఎస్​ను ఏడాదిగా విజ్ఞప్తి చేస్తున్నా స్పందించట్లేదు.  - వినయ్​, వీఆర్వోల సంక్షేమ సంఘం నాయకుడు