ఒకాయన అలా నడుస్తూ పోతుంటే.. ఒకచోట బంగారు ఖనిజాన్ని చూశాడు. వెంటనే గవర్నమెంట్ నుంచి లైసెన్స్ తీసుకుని తవ్వకాలు మొదలుపెట్టాడు. వేల కిలోల కొద్దీ బంగారం, వెండి దొరికింది. దాంతో అతనికి ఆశ పెరిగింది. ఇంకా ఎక్కువ మందితో పనిచేయించాడు. అలా పనిచేసేవాళ్లతో ఒక ఊరే ఏర్పడింది. అంతా బాగానే ఉందనుకునే ఆ మైన్ పతనం మొదలైంది. 1942లో దాన్ని మూసేశారు. అప్పటి నుంచే దాన్ని ఘోస్ట్ సిటీ అని పిలుస్తున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? ఒకప్పుడు వైభవంగా ఉన్న ఊరు ఇప్పుడు ఎందుకు పాడుపడిపోయింది? ఇలాంటి డౌట్స్ మీక్కూడా వస్తున్నాయా? అయితే.. ఇది చదివేయండి.
హెన్రీ వికెన్‌బర్గ్ ఒకప్పటి ప్రష్యా నుంచి అమెరికాకు వచ్చిన వలసదారుడు. ఆయన 1863లో ఒకసారి అరిజోనా ఎడారి మీదుగా సరదాగా వెళ్తూ... చనిపోయిన రాబందును చూశాడు. అదెలా చనిపోయిందో తెలుసుకుందామనే ఆసక్తితో, దాన్ని చూడడానికి దగ్గరగా వెళ్లాడు. అక్కడ ఉన్న నల్లటి ఈకల కుప్పను పక్కకు తోశాడు. అక్కడ ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని.. పరీక్షించి చూస్తే.. బంగారు ఖనిజం. సుమారు పావుకిలో వరకు ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దాంతో అప్పటి అమెరికన్ గవర్నమెంట్ నుంచి మైనింగ్ కోసం పర్మిషన్స్ తీసుకుని పనులు మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అది అరిజోనాలో అత్యంత విలువైన బంగారు గనుల్లో ఒకటిగా మారిపోయింది.
రాబందు కళేబరం వల్ల దీన్ని కనిపెట్టినందుకు ‘వల్చర్ మైన్’ అని పేరు పెట్టాడు. 1942లో గని మూసివేసే నాటికి అందులో నుంచి 7,370 కిలోల వెండి, 9,638 కిలోల బంగారం తవ్వి తీశారు. అయితే.. దీనికి రెండింతల బంగారం దొరికిందని, అక్కడ పనిచేసేవాళ్లు సగానికిపైగా దొంగిలించారని కొందరు చెప్తుంటారు. ఆ గనిలో పనిచేయడానికి వచ్చిన కార్మికులతో ఏర్పాటైన వల్చర్ సిటీలో దాదాపు ఐదు వేల మంది ఉండేవాళ్లు. ఈ మైన్, ఊరికి సంబంధించి అనేక దెయ్యాల కథలు ప్రచారంలో ఉన్నాయి. చీకటి పడ్డాక మైన్ దగ్గరకు వెళ్లిన వాళ్లు తిరిగి రావడం కష్టమని, అక్కడి దెయ్యాలు చంపేస్తాయని ఇప్పటికీ నమ్ముతున్నారు అక్కడివాళ్లు. అందుకే ఒకప్పుడు వైభవంగా ఉన్న సిటీ మొత్తం ఖాళీ అయింది. ఇప్పుడక్కడ పాత గోడలు, దుమ్ము పట్టిన మెషిన్లు, అప్పట్లో వాడిన సామాన్లు మాత్రమే కనిపిస్తాయి.
ఏం జరిగింది?
యాజమాన్యం తవ్వకాలు మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే భారీ సంఖ్యలో మైనర్లను రిక్రూట్ చేసింది. తర్వాత వాళ్లలో కొందరు బంగారం మీదున్న ఆశతో దొంగతనాలు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసేవాళ్లు. అలాంటివాళ్లలో చాలామంది అనుమానాస్పదంగా చనిపోయేవాళ్లు. కొన్నిసార్లు కారణాలు కూడా తెలిసేవి కావు. అంతేకాదు.. అక్కడ కొన్ని స్పెషల్ రూల్స్ అమలులో ఉండేవి. మైన్‌లో బంగారం దొంగతనం చేస్తే.. పోలీసుల వరకు వెళ్లేది కాదు. ఎవరు దొంగతనం చేసినా ఏమాత్రం జాలి లేకుండా ఉరి తీయించేవాడు యజమాని హెన్రీ వికెన్‌బర్గ్. అతని ఇంటికి దగ్గర్లో ఉన్న ఒక చెట్టుకు దాదాపు 18 మైనర్లను ఉరి తీయించాడు. వాళ్ల పరిస్థితి చూసి ఇంకెవరూ దొంగతనం చేయకూడదని.. అలా చేసేవాడు. తర్వాత ఆ చెట్టు దగ్గరే సమాధి చేసేవాడు.
కొందరైతే వాళ్లను పాతిపెట్టకుండా కుళ్లిపోయే వరకు చెట్టుకే వేలాడదీసేవాడని చెప్తున్నారు. అక్కడ ఉరి తీయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ చెట్టు దగ్గర్లో దెయ్యాలు కనిపించాయని చాలామంది చెప్పేవాళ్లు. అందుకే అటు వైపు వెళ్లేందుకు కూడా భయపడేవాళ్లు. ఇదొక్కటే కాదు.. మైన్‌లో తవ్వకాలు మొదలైన కొన్నేండ్లలో చుట్టుపక్కల పట్టణాల్లో క్రైం కూడా పెరిగింది. అత్యాచారాలు, హత్యలు, విచిత్రమైన ప్రమాదాలు జరిగేవట.
జిమ్మీ డేవిస్
ఈ మైన్‌లో పనిచేసే జిమ్మీ డేవిస్ కష్టపడి పనిచేసే వ్యక్తి. చాలా నిజాయితీగా ఉంటాడు. ఒకరోజు జిమ్మీ పని చేస్తుండగా ‘పుల్లీ సిస్టమ్’లో సమస్య వచ్చింది. దాంతో మెషిన్ బెల్ట్‌ను సరిచేయడానికి నిచ్చెన పైకి ఎక్కాడు జిమ్మీ. అదే టైంలో అతని చెయ్యి పుల్లీ లూప్‌లో చిక్కుకుంది. చేతిని బయటికి తీయడానికి ఎంత ట్రై చేసినా రాలేదు. ఆ తర్వాత మెషిన్ ప్రెజర్ వల్ల జిమ్మీ కూడా మెషిన్‌లోకి వెళ్లిపోయాడు. ఆ మెషిన్ అతని ప్రతి ఎముకను విరగ్గొట్టింది. తర్వాత బాడీ కూడా ముక్కలు ముక్కలై, ఆ ముక్కలన్నీ మెషిన్లలోని మెయిన్ షాఫ్ట్ దగ్గర ఇరుక్కుపోయాయి.
అప్పటినుంచి జిమ్మీ దెయ్యంగా మారి అక్కడ పనిచేసేవాళ్లను వేధించేవాడట. అతని చెయ్యి మెషిన్‌లో పడ్డప్పుడు ‘హెల్ప్ మీ.. హెల్ప్.. మీ’ అని బిగ్గరగా అరిచాడు. అవే అతని చివరి మాటలు. అవే మాటలు ప్రతిరోజు అర్ధరాత్రి కాగానే మైన్ అంతటా వినిపించేవి. ఇప్పటికీ అతని గొంతు వినిపిస్తుంటుందట. జిమ్మీతో పాటు అనేక దెయ్యాలు ఈ మైన్‌లో ఉన్నాయట. ముఖ్యంగా జనరేటర్ రూం నుంచి ఎప్పుడూ ఏవో శబ్దాలు వినిపిస్తుంటాయట. అందులోకి ఎవరైనా వెళ్తే వాళ్ల చుట్టూ మనుషులు తిరిగినట్టు అడుగుల చప్పుడు వినిపిస్తుంది. కానీ.. ఎవరూ కనిపించరు.
దొంగల ఆత్మలు
కొందరు దొంగలు కూడా ఈ మైన్ దగ్గరే చనిపోయారు. బంగారం మీదున్న ఆశతో దెయ్యాలై ఈ మైన్ దగ్గరే ఉన్నారని చెప్తుంటారు. వల్చర్ మైన్స్‌లో ఒకటైన గ్లోరీ హోల్‌లో చాలా బంగారం ఉందని, దాన్ని దొంగతనంగా తవ్వాలని ఒక దొంగల ముఠా వచ్చింది. కానీ.. వాళ్లకు ఏ వైపు తవ్వాలో తెలియక.. మైన్‌కు సపోర్టుగా ఉండే పిల్లర్ భాగాన్ని తవ్వడంతో మైన్ ఒక్కసారిగా కూలిపోయింది. దాంతో పై కప్పు మీద పడి అందులో ఉన్న ఏడుగురు దొంగలు అక్కడికక్కడే చనిపోయారు. వాళ్ల శవాలు తీసి, పూడ్చి పెట్టడం దండగ అనుకున్న యాజమాన్యం వాళ్లను ఆ మట్టిలోనే వదిలేసింది. వాళ్ల శవాలను ఇప్పటికీ బయటికి తీయలేదు. వాళ్లు కూడా దెయ్యాలుగా మారి ఆ మైన్ చుట్టూ తిరిగేవాళ్లని చెప్తుంటారు.
అతని మరణం
హెన్రీ వికెన్‌బర్గ్ 1884లో మైన్‌లో ఒక క్యాబిన్‌ని ఏర్పాటు చేయించుకున్నాడు. దాన్ని చాలామంది సిటీ జైలు అని పిలిచేవాళ్లు. ఎందుకంటే.. ఎవరైనా చిన్న తప్పులు చేస్తే అక్కడే శిక్షించేవాడు. వల్చర్ సిటీ శ్మశానవాటికలో ఈ మైన్‌లో చనిపోయిన 90 మంది శవాలను ఖననం చేశారు. చివరి రోజుల్లో వాళ్ల శాపం అతనికి తగిలిందని అందరూ అనుకునేవాళ్లు. అందుకే 85 ఏండ్ల వయసులో తనను తాను కాల్చుకుని చనిపోయాడని అనేకునేవాళ్లు. అతను చనిపోయేనాటికి.. అంటే 1905లో అతని దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. సంపాదించిందంతా ఖర్చయిపోయింది. ఆ మైన్ మాత్రమే మిగిలింది.
అస్సే బిల్డింగ్‌లో..
మైన్ ప్రాంతంలో కట్టించిన అస్సే బిల్డింగ్‌లో బంగారం క్వాలిటీని చెక్ చేస్తుంటారు. అయితే.. అక్కడి నుంచి కూడా బంగారం దొంగతనం చేయడానికి కొందరు ప్రయత్నించారు. ఒక మైనర్ పెద్ద బంగారు కడ్డీని తీసుకెళ్తుండగా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ బిల్డింగ్ నుంచి కాల్పుల సౌండ్ వినిపించింది. చూస్తే.. ఆ మైనర్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అప్పటినుంచి ఆ బిల్డింగ్‌లో దొంగతనం చేయాలంటే అందరూ భయపడేవాళ్లు. మరోసారి.. ముగ్గురు బందిపోట్లు అస్సే బిల్డింగ్ పైనుంచి లోపలికి వెళ్లి, కాల్పులు జరిపారు. ఒక గార్డును చంపి, అక్కడి నుంచి పారిపోయారు. వెంబడించిన గార్డులు కొద్దిసేపట్లోనే బందిపోట్లను పట్టుకుని, స్పాట్‌లోనే కాల్చి చంపేశారు. వాళ్లను ఊరిలో ఖననం చేయడానికి ప్రజలు ఒప్పుకోకపోవడంతో దగ్గర్లోని ఎడారిలో ఖననం చేశారు.
టూర్‌కి వెళ్లొచ్చు
ఈ ప్లేస్ అరిజోనాలోని ఫీనిక్స్ నగరం నుంచి 50 మైళ్ల దూరంలో, వికెన్‌బర్గ్ పట్టణానికి 12 మైళ్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఇది ఒక ప్రైవేట్ కంపెనీ అండర్‌లో ఉంది. వాళ్లు దీన్ని టూరిస్ట్ ప్లేస్‌గా డెవలప్ చేశారు. టికెట్ కొనుక్కొని పగటి వేళల్లో ఈ మైన్‌లోకి వెళ్లి, 1942 నాటి పరిస్థితులను ఇప్పటికీ చూడొచ్చు. ఆ కాలం నాటి మోటార్లు, పంపులు, తుప్పు పట్టిన పాత కార్ బాడీలు, ఎలివేటర్, ఇండ్లు ఇప్పటికీ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక టూర్ ఆఫీస్ కూడా ఉంది. వారాంతాల్లో గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారు.
అయితే.. ఈ ప్లేస్‌కి వెళ్లినవాళ్లలో కొందరికి వింత అనుభవాలు ఎదురైనట్టు చెప్తుంటారు. మైన్‌లోకి వెళ్లినప్పుడు వింత సౌండ్స్ వినిపించాయని, తమ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు అనిపించిందని.. దాని వల్ల కొన్ని ప్లేస్‌ల్లో ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండలేకపోయామని చెప్పారు. దీన్ని బట్టి ఇప్పటికీ ఆ దెయ్యాలు టూరిస్ట్‌లను వేధిస్తున్నాయని చెప్తుంటారు. ముఖ్యంగా చాలామందికి గుసగుసలు వినిపించాయని చెప్తుంటారు. గదుల్లో ఒక్కరే ఉన్నప్పుడు గోడలపై నీడలను చూశామని కొందరు చెప్పారు. ::: కరుణాకర్ మానెగాళ్ల
