రష్యా రాజధాని మాస్కో వైపు దూసుకొస్తున్న వాగ్నర్ సైన్యం...

రష్యా రాజధాని మాస్కో వైపు దూసుకొస్తున్న వాగ్నర్ సైన్యం...

రష్యా సైన్యంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వాగ్నర్ గ్రూప్.. కీలక ఆదేశాలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం రొస్తోవ్ లోని మిలిటరీ కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నామని ఓ వీడియో ద్వారా ప్రకటించారు. రోస్తోవ్-ఆన్-డాన్ నగరంలోని రష్యా దక్షిణ ప్రాంత సైనిక ప్రధాన కార్యాలయంలోకి వాగ్నర్ చీఫ్ యెవ్‌జెనీ ప్రిగోజిన్ అడుగు పెట్టినట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ నగరాన్ని తమ నియంత్రణలో తీసున్నామని, మాస్కో వైపు వస్తామని చెబుతూ ప్రిగోజిన్ ఒక వీడియోలో కనిపించారు. రష్యా రక్షణ మంత్రి సెర్గెయ్ షోయిగు, జనరల్ వాలరీ గెరాసిమోవ్ తనను కలవడానికి రాకపోతే మాస్కోను ముట్టడిస్తామని ఆయన అన్నారు. “మేం ఇక్కడికి వచ్చేశాం. ఆర్మీ చీఫ్‌తో పాటు షోయిగును మేం కలవాలనుకుంటున్నాం. వాళ్ళు కనుక రాకపోతే మేం రోస్తోవ్ నగరాన్ని దిగ్బంధం చేసి, మాస్కో వైపు వస్తాం”అని ప్రిగోజిన్ అన్నారు.

ఇప్పటికే రొస్తోవ్ నగరంలోని అన్ని సైనిక స్థావరాలను ఆక్రమించామని వాగ్నర్ టీం చెబుతున్నప్పటికీ అది నిజమా, కాదా అన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. మరోపక్క సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఆ గ్రూప్ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రష్యన్ నేషనల్ గార్డుకు చెందిన ఓ బృందం, ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ కీలక పరిణామాల క్రమంలో పుతిన్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎలా ముందుకు సాగుతారన్న దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది.

ALSO READ:వెన్నులో కత్తితో పొడిచారు.. మీకు శిక్ష తప్పదు : వాగ్నర్ గూప్ కు పుతిన్ వార్నింగ్