వెన్నులో కత్తితో పొడిచారు.. మీకు శిక్ష తప్పదు : వాగ్నర్ గ్రూప్ కు పుతిన్ వార్నింగ్

వెన్నులో కత్తితో పొడిచారు.. మీకు శిక్ష తప్పదు : వాగ్నర్ గ్రూప్ కు పుతిన్ వార్నింగ్

ఉక్రెయిన్ తో యుద్దం క్రమంలో సైన్యానికి అండగా నిలిచి వాగ్నర్ గ్రూప్.. ఒక్కసారిగా రష్యా ప్రభుత్వానికి ఎదురుతిరగడంతో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పుతిన్.. వాగ్నెర్ సైనికులపై విరుచుకుపడ్డారు. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన వారిని ‘విద్రోహులు’గా అభివర్ణించారు. ఇంతకాలం నమ్మకంగా పనిచేసిన దేశానికి వెన్నుపోటు పొడిచారని, భవిష్యత్ లో కీలక పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఆయన హెచ్చరించారు. వాగ్నెర్ సైనికులు, వారికి మద్దతు ఇస్తున్న వారు లొంగిపోండి అని, మీ భద్రతకు తాను హామీ ఇస్తున్నానని పుతిన్ ప్రకటించారు.

సొంత లాభం కోసం వాగ్నర్ గ్రూప్ దేశానికి ద్రోహం చేస్తోందని పుతిన్ వ్యాఖ్యానించారు. దీన్ని ఆయన ద్రోహచర్య అన్నారు. వాగ్నర్ టీం కోసం మద్దతు తెలిపే, ఆయుధాలు పట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, దేశ ప్రజలను కాపాడుకునేందుకు తాను ఎలాంటి చర్యలైనా, నిర్ణయాలైనా తీసుకుంటానని పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు.

పుతిన్ ప్రసంగానికి కొద్ది సేపు ముందే ఆ దేశ రక్షణ మంత్రి వాగ్నర్ సైన్యంతో మాట్లాడారు. మీరంతా మోసానికి గురయ్యారని, మిమ్మల్ని ఓ నేరంలోకి నెట్టారన్నారు. వారంతా స్థానిక అధికారులను సంప్రదించవచ్చని, మీ భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా తాము చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

ALSO READ:రష్యాలో వాగ్నర్ గ్రూప్ అంటే ఏంటీ.. రాక్షసత్వానికి.. క్రూరత్వానికి మారుపేరు