కేంద్రం ఏం చెబుతుందో చూసి.. కాక్రోచ్ పార్టీ' అకౌంట్లపై నిర్ణయం: ఢిల్లీ హైకోర్టు

కేంద్రం ఏం చెబుతుందో చూసి.. కాక్రోచ్ పార్టీ' అకౌంట్లపై నిర్ణయం: ఢిల్లీ హైకోర్టు

సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ.. యూత్ ఫుల్ ట్రెండ్‌తో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి షాక్ తగిలింది. తమ అఫీషియల్ ఎక్స్ అకౌంట్‌ను వెంటనే పునరుద్ధరించాలంటూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తక్షణ ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

కోర్టు ఏమంది?
జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. సీజేపీ పార్టీ అకౌంట్‌లో పోస్ట్ చేసిన కొన్ని కంటెంట్స్ కొద్దిగా అభ్యంతరకరంగా ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం, అలాగే ఎక్స్ ప్లాట్‌ఫారమ్ వాదనలు వినకుండా వెంటనే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మొత్తం అంశాన్ని సమగ్రంగా పరిశీలించాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.

అభిజీత్ దిప్కే తరపున హాజరైన సీనియర్ అడ్వకేట్ అఖిల్ సిబాల్.. గతంలో ఇలాంటి కేసుల్లో కోర్టులు ఇచ్చిన తాత్కాలిక ఉపశమనాలను ప్రస్తావించారు. అభ్యంతరకరమైన పోస్టులను బ్లాక్ చేసి, అకౌంట్‌ను రీస్టోర్ చేసినా ఓకే అని కోరారు. అయితే దీనిపై స్పందించిన బెంచ్.. మిగతా కేసులకు, దీనికి కొంచెం తేడా ఉందని, ఇక్కడ మొత్తం యాక్టివిటీనే కొద్దిగా అభ్యంతరకరంగా ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా అకౌంట్ల బ్లాకింగ్‌ను పరిశీలించే సెంట్రల్ రివ్యూ కమిటీ ముందు తమ వాదనలు వినిపించే అవకాశాన్ని కోర్టు అభిజీత్‌కు కల్పించింది.

భారతదేశ యువతను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చేసిన "కాక్రోచ్" వ్యాఖ్యల వివాదం తర్వాత.. ఈ పార్టీ కేవలం ఒక జోక్‌గా, సెటైరికల్ గ్రూప్‌గా ప్రారంభమైంది. కానీ ఇండియా జెన్ జీ యువత నుంచి రోజుల వ్యవధిలోనే పిచ్చి ఫాలోయింగ్ రావటంతో హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజకీయాల్లో ఇదొక కొత్త మార్పును తీసుకొస్తుందని అందరూ భావించటంతో సోషల్ మీడియాలో ఈ పార్టీ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతున్న వేళ.. హఠాత్తుగా భారత్‌లో దీని 'ఎక్స్' అకౌంట్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, వెబ్‌సైట్‌లపై కూడా ఇలాంటి ఆంక్షలే వచ్చాయని అభిజీత్ దిప్కే ఆరోపిస్తున్నారు. మెుత్తానికి కేంద్రం నుంచి దీనిపై క్లారిటీ తీసుకున్నాకే కోర్టు నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది.