
- స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చల్లో ఇరు దేశాల నిర్ణయం
- 115 శాతం సుంకాల తగ్గింపు కోసం అంగీకారం
అమెరికా, చైనా మధ్య కొన్ని నెలలుగా కొనసాగుతున్న టారిఫ్ వార్‌కు తాత్కాలికంగా బ్రేక్‌పడింది. పరస్పరం విధించుకున్న ప్రతీకార సుంకాలను 90 రోజులపాటు వాయిదా వేసేందుకు సోమవారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన ఇరు దేశాల ప్రతినిధుల సమావేశంలో అంగీకరించాయి. చర్చల ద్వారా ట్రేడ్ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి.
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సోమవారం ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమై చర్చించారు. 115 శాతం వరకు టారిఫ్‌లను తగ్గించుకోవాలని నిర్ణయించారు. చైనా ఉత్పత్తులపై అమెరికా 145 శాతం టారిఫ్ వేస్తుండగా.. అందులో 115 శాతం తగ్గించింది. అంటే చైనాపై అమెరికా వేసే టారిఫ్‌లు 30 శాతానికి పరిమితం కానున్నాయి. ఇక, అమెరికా ఉత్పత్తులపై చైనా 125 శాతం టారిఫ్ వేస్తుండగా.. దాన్ని 115 శాతం తగ్గించింది. అంటే అమెరికా ఉత్పత్తులపై చైనా వేసే టారిఫ్‌లు 10 శాతానికి పరిమితం కానున్నాయి. ఈ ఒప్పందం 90 రోజుల పాటు అమలులో ఉంటుందని ఇరు దేశాల ప్రతినిధులు ప్రకటించారు.
వాస్తవానికి.. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ట్రంప్ చైనాతో టారిఫ్ వార్ మొదలుపెట్టారు. చైనా ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు విధించారు. ఇందుకు ప్రతిగా చైనా కూడా అదే స్థాయిలో టారిఫ్‌లు వేయసాగింది. దీంతో ప్రపంచ మార్కెట్లు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఎట్టకేలకు దిగివచ్చిన ఇరు దేశాలు ప్రతీకార సుంకాలను తగ్గించుకోవడం, 90 రోజుల వరకు అది అమలులో ఉంటుందని ప్రకటించడం స్టాక్ మార్కెట్లను ఖుషీ చేశాయి. ఈ పరిణామాలతో అటు అమెరికా స్టాక్‌మార్కెట్లతో పాటు ఇండియా షేర్ మార్కెట్ కూడా భారీ స్థాయిలో లాభాల్లో దూసుకెళ్లాయి.