వనపర్తి చైర్ పర్సన్ పీఠంపై పీటముడి

వనపర్తి చైర్ పర్సన్ పీఠంపై పీటముడి

వనపర్తి, వెలుగు :  వనపర్తి మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా చైర్మన్ స్థానం ఓసీలకు దక్కలేదు. ఈసారి చైర్మన్ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో ఓసీలకే సీటు ఇవ్వాలనే  డిమాండ్​ పెరిగింది. ఈ సారి వనపర్తి స్థానాన్ని జనరల్​కు కేటాయిస్తారని ఆశించిన కాంగ్రెస్​ పార్టీలోని ఆశావహులు ఆ స్థానాన్ని జనరల్​ మహిళకు కేటాయించడంతో నిరాశచెందారు. 

దీంతో ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే ఎస్ఎల్ఎన్​ రమేశ్​తన భార్యను బరిలో నిలిపారు. ఇప్పుడు చైర్​ పర్సన్​ పీఠం ఆమెకే దక్కుతుందని అనుకున్నా బీసీ మహిళ, జనరల్​ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన మహిళా అభ్యర్థులు తమకూ అవకాశం కల్పించాలని పట్టుబడుతున్నారు. 

వీరిలోనూ కాంగ్రెస్​ పార్టీలో చాన్నాళ్లుగా పనిచేసినవారు ఉన్నారు. తాజాగా ఒక అభ్యర్థిని భర్త ఏకంగా చైర్​ పర్సన్​ స్థానాన్ని తన భార్యకు ఇవ్వకుంటే ప్రాణత్యాగానికైనా తెగిస్తానని బ్లాక్​ మెయిల్​కు తెరలేపినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం కౌన్సిలర్లంతా క్యాంపులో ఉన్నారు. చర్చల అనంతరం క్యాంపు నుంచి సోమవారం మున్సిపాలిటీకి నేరుగా కౌన్సిలర్లు హాజరుకానున్నారు.