
75 మంది జీపీ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు
వనపర్తి, వెలుగు: మొక్కల పెంపకంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆరుగురు పంచాయతీ సెక్రటరీలను కలెక్టర్ శ్వేతా మహంతి బుధవారం సస్పెండ్ చేశారు. మరో 75 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పేందుకు అధికారులు నిరాకరిస్తున్నప్పటికీ ఆరుగురు కార్యదర్శులు సస్పెన్షన్, 75 మందికి షోకాజ్లు జారీ చేసింది నిజమేనని వనపర్తి డీపీవో రాజేశ్వరి ధ్రువీకరించారు. జిల్లాలో 2 కోట్ల మొక్కలను పెంచాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో ప్రభుత్వం నర్సరీలను ఏర్పాటు చేసింది. మొక్కలు పెంచే బాధ్యతను ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీలకు అప్పగించింది. అయితే వేసవిలో అధిక ఉష్ర్ణోగ్రత కారణంగా నర్సరీల్లో అనుకున్న మేర మొక్కలు లేకపోగా, మిగిలిన వాటిని నాటినా బతకకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ డీపీవోకు ఆదేశాలు జారీ చేయడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.