ఉమ్మడి వనపర్తి జిల్లాలోని ట్యాక్స్ వసూళ్లపై కొత్త పాలకవర్గాల కసరత్తు

 ఉమ్మడి వనపర్తి జిల్లాలోని ట్యాక్స్ వసూళ్లపై కొత్త పాలకవర్గాల కసరత్తు
  •     లక్ష్యం 20 కోట్లు.. వసూలైంది 40 శాతమే!
  •     ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయడమే సవాల్

వనపర్తి, వెలుగు :  మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో ఉమ్మడి వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల్లో పన్నుల వసూలు ప్రక్రియ వేగవంతమైంది. గత నెల 20నే కొత్త పాలకవర్గాలు కొలువుదీరగా, ఈ నెలాఖరులోగా 100 శాతం పన్ను వసూలు చేయడం వారికి పెద్ద సవాల్‌‌‌‌‌‌‌‌గా మారింది. ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం రూ.20 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 40 శాతం మాత్రమే వసూలైంది. మిగిలిన 60 శాతం  మరో ఎనిమిది రోజుల్లోనే వసూలు చేయాల్సి ఉండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

వసూలైతేనే  ఆర్థిక సంఘం నిధులు

మున్సిపాలిటీలలో 100 శాతం పన్నులు వసూలైతేనే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశం ఉండటంతో కలెక్టర్ ఆదర్శ్ సురభి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, బిల్ కలెక్టర్ల ద్వారా ఇంటింటికీ తిరిగి ఆస్తి పన్ను, నల్లా బిల్లులు వసూలు చేయిస్తున్నారు. పన్నులతో పాటు ట్రేడ్ లైసెన్సుల రెన్యూవల్‌‌‌‌‌‌‌‌పై కూడా దృష్టి సారించి ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న సిబ్బంది అక్కడికక్కడే ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రశీదులు అందజేస్తూ, నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపాలిటీ వారీగా  పన్నుల వసూలు ఇలా

మున్సిపాలిటీ       పన్ను లక్ష్యం    వసూలు (రూ.కోట్లు)
వనపర్తి                   12.75                     3.76
కొత్తకోట                   2.30                      1.06
పెబ్బేరు                 1.19                       0.72
ఆత్మకూరు             2.26                      0.91
అమరచింత          0.62                      0.28