- వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి
వనపర్తి, వెలుగు : పోలీస్ విభాగానికి భద్రతా పరంగా మరింత బలాన్ని చేకూర్చే దిశగా, దొంగతనాలు, హత్య కేసుల విచారణలో కీలక ఆధారాలను పట్టుకోగల ట్రాకర్ శునకం ‘మాయ’ నూతనంగా వనపర్తి జిల్లా పోలీస్ విభాగంలో లో చేరినట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. 8 నెలలపాటు ప్రత్యేక శిక్షణను పూర్తి చేసుకున్న డాగ్ హాండ్లర్ కానిస్టేబుల్ దేవ్యానాయక్, గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ని కలిశారు.
హైదరాబాద్ సమీపంలోని పోలీస్ డాగ్ ట్రైనింగ్ సెంటర్, ఐఐటీఏ మోయినాబాద్‌లో నిర్వహించిన శిక్షణలో ట్రాకర్ శునకం ‘మాయ’ ప్రదర్శించిన సామర్థ్యాలు, ఫీల్డ్ లో దాని పనితీరు తదితర అంశాలను, శిక్షణ కాలంలో అనుమానాస్పద వస్తువుల గుర్తింపు, నేరస్థుల అడుగుజాడల పసిగట్టడం, క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతమైన విధి నిర్వహణలో విశేష ప్రావీణ్యం సాధించినట్లు తెలిపారు.
ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో జరిగే దొంగతనాలు, హత్య కేసుల దర్యాప్తులో ట్రాకర్ శునకం కీలక పాత్ర పోషిస్తుందని నేరస్థలంలో నేరస్థుల అడుగుజాడలను పసిగట్టి, దర్యాప్తునకు స్పష్టమైన దిశానిర్దేశం అందించడంలో ట్రాకర్ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ వీరారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
