- వార్షిక నివేదిక వెల్లడించిన ఎస్పీ
వనపర్తి, వెలుగు : నేర రహిత జిల్లాగా వనపర్తిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వార్షిక నివేదికను ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, యువత ప్రతిఒక్కరూ నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించడమే తమ బాధ్యతన్నారు. జిల్లాలో గతేడాది మొత్తం 2,782 కేసులు నమోదు కాగా, ఈసారి 2,894గా నమోదైనట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో నిరుడుతో పోల్చితే 39 మంది తక్కువగా చనిపోయారని చెప్పారు. దొంగతనం కేసులు 53 తగ్గాయని, 70.14 శాతం కేసులను చేధించామన్నారు. సైబర్ నేరాల కేసులు పెరిగినా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈసారి 36 పోక్సో కేసులు పెరిగాయని, ఈ కేసుల్లో నిందితులకు తప్పించుకునే అవకాశం ఉండదన్నారు. గతేడాదితో పోలిస్తే 21 ఎస్సీ, ఎస్టీ కేసులు తగ్గాయని పేర్కొన్నారు.
