వాంగ్‌‌‌‌ చుక్‌‌‌‌ ను సర్కారు దవాఖాన్లనే ఉంచాలి...చికిత్సపై డాక్టర్ల బృందానిదే తుది నిర్ణయం: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

వాంగ్‌‌‌‌ చుక్‌‌‌‌ ను సర్కారు దవాఖాన్లనే ఉంచాలి...చికిత్సపై డాక్టర్ల బృందానిదే తుది నిర్ణయం: ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు
  • ప్రైవేట్‌‌‌‌ ఆస్పత్రికి తరలించాలన్న సోనమ్‌‌‌‌ భార్య అప్పీల్‌‌‌‌ కొట్టివేత

న్యూఢిల్లీ: సఫ్దర్‌‌జంగ్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌‌చుక్‌‌ ట్రీట్‌‌మెంట్‌‌ కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వాంగ్‌‌చుక్‌‌ను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలన్న ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో విజ్ఞప్తిని అంగీకరించేందుకు కోర్టు నిరాకరించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, విద్యా వ్యవస్థలో సంస్కరణలకు డిమాండ్ చేస్తూ వాంగ్‌‌చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. మూడు వారాలుగా చేస్తున్న దీక్షతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో పోలీసులు శనివారం ఆయనను బలవంతంగా సఫ్దర్‌‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. 

అయితే, వాంగ్‌‌చుక్‌‌ను ప్రైవేట్‌‌ ఆస్పత్రికి తరలించాలని కోరుతూ ఆయన భార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారు. దీనిపై ఆదివారం జస్టిస్‌‌ మినీ పుష్కర్ణ నేతృత్వంలోని బెంచ్‌‌ విచారణ చేపట్టింది. పిటిషనర్‌‌‌‌ తరఫు లాయర్‌‌‌‌ కపిల్‌‌ సిబల్‌‌ వాదనలు వినిపిస్తూ, నచ్చిన ఆస్పత్రిలో.. డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్‌‌మెంట్‌‌ పొందే హక్కు వాంగ్‌‌చుక్‌‌కు ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదిస్తూ, వాంగ్‌‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది కాబట్టే ఆస్పత్రికి తరలించామని తెలిపారు. దేశ రాష్ట్రపతి కూడా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని గుర్తుచేశారు. ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాల్సిన అవసరం లేదని తెలిపారు. 

వాంగ్‌‌చుక్ ప్రాణాలను కాపాడేందుకు వైద్యపరమైన అన్ని చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, వాంగ్‌‌చుక్ ఆరోగ్యం క్షీణించినప్పటికీ స్వచ్ఛందంగా ఆస్పత్రిలో చేరలేదని, అలాంటి పరిస్థితుల్లో అవసరమైన ట్రీట్‌‌మెంట్‌‌ కోసం ప్రభుత్వం ఆయనను ఆస్పత్రికి తరలించడం ఏకపక్ష చర్య కాదని పేర్కొంది. ఆయన ఆరోగ్యాన్ని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షించడాన్ని బలవంతపు చికిత్సగా లేదా ఆయన స్వేచ్ఛకు భంగం కలుగుతున్నట్టుగా చెప్పలేమని కోర్టు అభిప్రాయపడింది. ఆయన భార్యతోపాటు కుటుంబ సభ్యులకు లిమిట్స్‌‌ లేకుండా వాంగ్‌‌చుక్‌‌ను  కలిసే అవకాశం ఆస్పత్రి వర్గాలు కల్పిస్తున్నాయని కోర్టు పేర్కొంది. 

ప్రస్తుతం వాంగ్‌‌చుక్‌‌ను ప్రైవేట్‌‌ ఆస్పత్రికి తరలించవచ్చనే ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఆయనకు ట్రీట్‌‌మెంట్‌‌ కొనసాగుతుందని చెప్పింది. చికిత్సకు సంబంధించి తుది నిర్ణయం డాక్టర్ల బృందమే తీసుకుంటుందని బెంచ్‌‌ పేర్కొంటూ విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా, సోనమ్ వాంగ్‌‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై సఫ్దర్‌‌జంగ్ ఆస్పత్రి ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగానే ఉందని, రక్తపరీక్షల్లో కొన్ని మార్పులు కనిపించాయని తెలిపింది.

పార్లమెంట్‌‌ ముట్టడికి తరలిరండి: వాంగ్‌‌చుక్‌‌ పిలుపు

కాక్రోచ్‌‌ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న పార్లమెంట్ ముట్టడిని విజయవంతం చేయాలని సోనమ్‌‌ వాంగ్‌‌చుక్‌‌ పిలుపునిచ్చారు. ఆస్పత్రిలో ఉన్న వాంగ్‌‌చుక్ తన భార్య గీతాంజలి ద్వారా ఈ సందేశాన్ని పంపించారు. అనంతరం ఆ మెసేజ్‌‌ను ఆమె ఎక్స్‌‌లో షేర్‌‌‌‌ చేశారు. సీజేపీ చేపట్టిన ఉద్యమాన్ని భారత రెండో స్వాతంత్ర్య ఉద్యమంగా వాంగ్‌‌చుక్‌‌ అభివర్ణించారు.