- ఆయన దీక్షకు సంఘీభావంగా ఒకరోజు ప్రజలంతా ..
- హంగర్ స్ట్రైక్ చేయాలని దీప్కే పిలుపు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో వాంగ్‌చుక్ చాలా బలహీనంగా, అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పేర్కొంది. ఈ ఉద్యమానికి మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజలు ఒక రోజు సంఘీభావ నిరాహార దీక్ష చేపట్టాలని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు.
సోనమ్ వాంగ్‌చుక్ తాజా ఆరోగ్య పరిస్థితిని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తాను బాగానే ఉన్నానని వాంగ్‌చుక్ చెబుతున్నప్పటికి, గంటగంటకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దీప్కే పేర్కొన్నారు. విద్యార్థుల న్యాయం కోసం ఒక గొప్ప విద్యావేత్త తన ప్రాణాలను పణంగా పెడుతుంటే, ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుందని ప్రశ్నించారు.
ఈ నిరసనకు మద్దతుగా ప్రజలంతా తమ ఇండ్ల నుంచే ఒక రోజు నిరాహార దీక్ష చేసి, ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. సీజేపీ బృందం కూడా వాంగ్‌చుక్‌తో కలిసి నిరాహార దీక్షలో పాల్గొంటుందని చెప్పారు. మరోవైపు, సీజేపీ నిరసన ప్రదర్శన శుక్రవారంతో 14వ రోజుకు చేరింది. గత వారం రోజులుగా ఈ ఉద్యమానికి పలువురు రాజకీయ నాయకులు, పౌర సమాజ ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.
