జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి

బంజారా బంగ్లాలు కాదు... రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బంజారా ఆదివాసీల సంఘాలు ఆందోళనకు దిగాయి.  బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించి సీఎం కేసీఆర్ బయటికి రాగానే.. ఆయన కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

భవనాలు కట్టిస్తే బతుకులు బాగుపడవని, రిజర్వేషన్లు కల్పిస్తే బాగుపడతాయన్నారు.  భవనాలను ముట్టడి చేసి ధర్నాకు దిగారు. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో బంజారా ఆదివాసీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీఎం డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు.

రోడ్డు నంబ‌ర్ -10లో కొమురం భీం ఆదివాసీ భ‌వ‌నం

అంతకుముందు బంజారాహిల్స్ రోడ్డు నంబ‌ర్ -10లో కొత్తగా నిర్మించిన కొమురం భీం ఆదివాసీ భ‌వ‌నాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన కేసీఆర్.. ఆదివాసీ బిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బంజారా భవన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్న ఆయన.. స్వరాష్ట్రంలో ఆదివాసీ, గిరిజన, లంబాడీ బిడ్డలందరూ తలెత్తుకునేలా ఆదివాసీ భవన్ నిర్మించామని అన్నారు. గిరిజన బిడ్డల సమస్యలు తీర్చాల్సిన అవసరముందని, ఇందుకోసం ఒక్కో అడుగు వేస్తున్నామని కేసీఆర్ అన్నారు. చదవు, విదేశాలకు వెళ్లడం, గిరిజన పోడు భూముల విషయంలో ఆదివాసీ బిడ్డల రక్షణ విషయంలో క్రమంగా పురోగమిస్తున్నామని చెప్పారు. సమస్యలన్నీ పరిష్కారం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆదివాసీ భవన్ గిరిజన బిడ్డల హక్కుల పరిరక్షణకు వేదిక కావాలని, వారి సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని ఆకాంక్షించారు.