
- ఢిల్లీలో అరెస్టు.. 2012లో తొలిసారి జైలుకి
- బెయిలుపై విడుదలై కూడా అదే పని
న్యూఢిల్లీ: ఊరికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఏటీఎంలే టార్గెట్.. గ్యాస్ కట్టరే ఆయుధం. పక్కాగా స్కెచ్ వేసి రంగంలోకి దిగాడంటే అంతే.. డబ్బు కొల్లగొట్టి సైలెంట్ గా జంప్!! ఇలా ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 33 ATMలు కొట్టగొట్టాడు. హర్యానాకు చెందిన ఈ ఏటీఎం దొంగ జహీద్ (27)ను ఎట్టకేలకు శనివారం రాత్రి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
బెయిల్ పై తిరుగుతూ.. దేశమంతా చోరీలు
నార్త్, సౌత్ అనే తేడా లేదు.. దేశమంతా ఏటీఎంలకు కన్నాలేశాడు జహీద్. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా ఇలా పలు రాష్ట్రాల్లో మొత్తం 33 చోరీలకు పాల్పడ్డాడు. 2012లో తొలిసారి ఓ ఏటీఎం చోరీ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కొన్నాళ్లకు బెయిల్ పై బయటికొచ్చాడు. జైలు జీవితం గడిపినా బుద్ధి మార్చుకోలేదు. దొంగతనాలు చేయడంలో మరింత నేర్పరితనం ప్రదర్శించాడు. దాదాపు ఏడేళ్ల పాటు ఎక్కడా పట్టుబడకుండా చోరీలు సాగించాడు.
ఇన్ఫార్మర్ల సాయంతో..
జనావాసాలకు దూరంగా, సెక్యూరిటీ లేకుండా ఉండే ఏటీఎంలే జహీద్ టార్గెట్. గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం పగలగొట్టి డబ్బు దోచుకుని వెళ్లిపోయేవాడు. పోలీసులకు దొరక్కుండా హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్ లలో తిరుగుతూ జల్సాలు చేసేవాడు. శనివారం ఢిల్లీలో తనకు కావాల్సిన వారిని కలిసేందుకు వస్తున్నాడని ఇన్ఫార్మర్ల ద్వారా పోలీసులకు పక్కా సమాచారం అందింది. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాతంలో అతడిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు చెప్పారు.