
- మళ్లీ మొదలైన రాజకీయ వైరం
- మొదటి నుంచీ ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలే
- ఎన్నికల నేపథ్యంలో మరోమారు పంచాయితీ
మెదక్, వెలుగు : అధికార పార్టీ కి చెందిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య మరోసారి వార్ మొదలైంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు పార్టీలో ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక మైనంపల్లి మెదక్ నియోజకవర్గం నుంచి మల్కాజ్‌గిరికి షిఫ్ట్ కావడంతోపాటు, టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో విభేదాలు సద్దుమణిగాయి. మైనంపల్లి ఈసారి మళ్లీ మెదక్ నియోజకవర్గం పై దృష్టి పెట్టడంతో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య మళ్లీ రాజకీయ యుద్ధం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో పద్మా దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో, మైనంపల్లి తెలుగు దేశంలో పార్టీలో ఉన్నారు.
చిన్నశంకరంపేట మండలానికి చెందిన హన్మంతరావ్ 2004 ఎన్నికల్లో రామాయంపేట అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని ఆశించారు. అయితే కొన్ని కారణాలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు కాకుండా ఆయన భార్య మైనంపల్లి వాణికి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో కేసీఆర్ కూడా మహిళా అభ్యర్థిని బరిలో దించాలని భావించి రామాయంపేట జడ్పీటీసీగా ఉన్న పద్మాదేవేందర్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచే పద్మా దేవేందర్ రెడ్డి, మైనంపల్లి రాజకీయ విరోధులుగా మారారు.
ఆ ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డి రామాయంపేట ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత తెలంగాణా సాధన ఉద్యమంలో భాగంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనువార్యమయ్యాయి. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో పద్మపై మైనంపల్లి హన్మంతరావ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో రామాయంపేట నియోజకవర్గం రద్దయి ఆ నియోజకవర్గంలోని పలు మండలాలు మెదక్ నియోజకరవర్గంలో కలిశాయి. ఈ క్రమంలో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి పోటీకి టీఆర్ఎస్ తరపున పద్మా దేవేందర్ రెడ్డి, టీడీపీ తరపున హన్మంతరావ్ పోటీకి సిద్దమయ్యారు. కాగా ఆ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని మహాకూటమిగా ఏర్పడగా మెదక్ స్థానాన్నిటీడీపీకీ కేటాయించారు. దీంతో హన్మంతరావ్కు టికెట్ దక్కగా, భంగపడ్డ పద్మాదేవేందర్ రెడ్డి రెబెల్ అ భ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో మైనంపల్లి విజయం సాధించారు. వరుసగా రెండు ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డి మైనంపల్లి మీద పోటీచేసి ఓటమి చవిచూశారు.
మైనంపల్లి మల్కాజ్‌గిరికి వెళ్లడంతో...
2014లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక మైనంపల్లి హన్మంతరావ్ మెదక్ నుంచి హైద్రాబాద్ మల్కాజ్గిరి కి షిఫ్ట్ అయ్యారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షులు అయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2018 ఎన్నికల్లో మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానంలో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. మైనంపల్లి మల్కాజ్‌గిరికి మారాక మెదక్ లో పద్మాదేవేందర్ రెడ్డికి తిరుగు లేకుండా పోయింది. వరుసగా 2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు.
పదేళ్ల తర్వాత అనూహ్యంగా రీ ఎంట్రీ
మల్కాజ్ గిరికి వెళ్లిపోయిన మైనంపల్లి దాదాపు పదేళ్ల తరువాత అనూహ్యంగా గత ఫిబ్రవరిలో మళ్లీ మెదక్ సెగ్మెంట్లో రీ ఎంట్రీ ఇచ్చారు. తన కొడుకు మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మెన్ డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను రానున్నఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయించే ఆలోచనతో విస్తృతంగా సోషల్ సర్వీస్ చేపట్టారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను తన వైపు తిప్పుకున్నారు.
మైనంపల్లి రీఎంట్రీతో మెదక్ సెగ్మెంట్లో పద్మాదేవేందర్ రెడ్డికి ఆయనకు మధ్య మళ్లీ రాజకీయ వైరం మొదలైంది. బీఆర్ఎస్ అధిష్టానం పద్మా దేవేందర్‌రెడ్డికే టికెట్ ఇవ్వడంతో మైనంపల్లి రగిలిపోతున్నారు. తన కొడుకును మెదక్ లో పోటీ చేయించి తీరుతానని ఆయన ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.