బీజేపీలో టికెట్ల పంచాది

బీజేపీలో టికెట్ల పంచాది
  •      సీట్లు దక్కని, ఫస్ట్ లిస్టులో పేర్లు లేని నేతల అసంతృప్తి  
  •     హైదరాబాద్​లో ‘వేరే మొగోడు దొరకలేదా?’ అంటూ రాజాసింగ్ కామెంట్
  •     మల్కాజ్​గిరి సీటు దక్కలేదని మురళీధర్ రావు గుర్రు
  •     నాగర్​కర్నూల్​ టికెట్​ దక్కలేదని బంగారు శృతి మనస్తాపం
  •     నిరాశలో డీకే అరుణ, జితేందర్​రెడ్డి, సోయం బాపూరావు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ లోక్​సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. టికెట్లు ఆశించి భంగపడిన కొందరు, ఫస్ట్ లిస్టులో పేర్లు లేవని మరికొందరు సీనియర్​లీడర్లు హైకమాండ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగైదు నియోజకవర్గాల నుంచి కొందరు సీనియర్​లీడర్లు టికెట్ ఆశించారు. అయితే వాళ్లను కాదని కొత్త వారికి టికెట్లు ఇవ్వడంతో ఆ నేతలందరూ అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, మల్కాజ్​గిరి, నాగర్​కర్నూల్, జహీరాబాద్ టికెట్ల ప్రకటనపై పార్టీ లీడర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇద్దరు ముగ్గురు లీడర్లు పార్టీ మారేందుకూ సన్నాహాలు చేసుకుంటున్నట్టు టాక్​ వినిపిస్తున్నది. మరోవైపు ఫస్ట్ లిస్టులో పేర్లు లేకపోవడంపై మరికొందరు లీడర్లు నారాజ్ అవుతున్నారు. తమ నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.   

రాజాసింగ్​అసంతృప్తి..

హైదరాబాద్​టికెట్​ను విరించి ఆసుపత్రి చైర్మన్​మాధవీలతకు కేటాయించడంపై గోషామహల్​ఎమ్మెల్యే రాజాసింగ్​తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఈ​టికెట్​రేసులో ముందు నుంచి రాజాసింగ్​కూడా ఉన్నారు. టికెట్​కోసం ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. అయితే మాధవీలతకు టికెట్​ఇవ్వడంతో ఆయన అసంతృప్తికి లోనైనట్టు చెబుతున్నారు. అసలు పార్టీలో చేరకముందే మాధవీలతకు టికెట్​ఎట్ల ఇస్తారని రాజాసింగ్ ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. 

హైదరాబాద్​స్థానం నుంచి అసదుద్దీన్​ఒవైసీపై పోటీ చేసేందుకు ‘వేరే మొగోడు ఎవరూ దొరకలేదా?’ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. నిజానికి కొద్ది రోజులుగా రాజాసింగ్​పార్టీ కార్యక్రమాలకు దూరంగాఉంటున్నారు. బీజేఎల్పీ నేత పదవి వస్తుందని ఆశలు పెట్టుకోగా, అది ఇవ్వకపోవడంతోనే రాజాసింగ్ అసహనానికి లోనైనట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. 

మురళీధర్​రావు అలక..

మల్కాజిగిరి టికెట్​కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్​రావు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. కానీ ఆ టికెట్ ఈటల రాజేందర్​కు ఇచ్చారు. దీంతో మురళీధర్ రావు అసహనంతో ఉన్నారు. తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచారు. ‘‘గత కొన్నేండ్లుగా నా సహచరులు, పార్టీ కార్యకర్తలు, నా బాగు కోరుకునేవాళ్లంతా అండగా నిలిచారు. మల్కాజ్ గిరి పార్లమెంట్​సెగ్మెంట్​లో పార్టీ కార్యక్రమాలు, ప్రచారాల్లో నా వెన్నంటి ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. త్వరలోనే కార్యకర్తలందరితో సమావేశమవుతాను. భవిష్యత్​కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాను’’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఇది వైరల్​గా మారింది. టికెట్​రాకపోవడంతోనే ఆయన ఇలా పోస్టు పెట్టారని, పార్టీ మారుతారా? అని చర్చ నడుస్తున్నది. 

నిరాశలో డీకే అరుణ, జితేందర్​ రెడ్డి..

పార్టీ సీనియర్​ లీడర్లు డీకే అరుణ, జితేందర్​రెడ్డి కూడా తొలి విడత టికెట్ల ప్రకటనపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. మహబూబ్​నగర్​టికెట్​కోసం పోటీ పడుతున్న వీళ్లిద్దరూ.. టికెట్​తమకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఫస్ట్ లిస్టులోనే పేరు ఉంటుందని భావించారు. అయితే, ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో ఆ స్థానాన్ని హైకమాండ్ హోల్డ్​లో పెట్టింది. ఒకరికి మహబూబ్​నగర్​ టికెట్​ఇచ్చి, మరొకరిని వేరే స్థానం నుంచి బరిలోకి దింపాలని అధినాయకత్వం యోచించింది. 

అయితే దానిపై ఇద్దరు నేతలతో మాట్లాడితే, ఎవరూ ఒప్పుకోలేదని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే మహబూబ్​నగర్​ టికెట్​ను హోల్డ్​లో పెట్టింది. ఈ నిర్ణయంపై ఇద్దరు నేతలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక జహీరాబాద్​టికెట్​ను బీబీ పాటిల్​కు ఇవ్వడంపై ఆలె నరేంద్ర​కుమారుడు ఆలె భాస్కర్, మాజీ మంత్రి బాగారెడ్డి కుమారుడు జైపాల్​రెడ్డి రాష్ట్ర నాయకత్వం వద్ద నిరసన తెలిపినట్టు తెలుస్తున్నది.  
 
టికెట్ ఇవ్వకుంటే నా దారి నేను చూసుకుంట: ఎంపీ సోయం 

ఆదిలాబాద్, వెలుగు: తనకు ఎంపీ టికెట్ రాకుండా పార్టీ ముఖ్య నేతలే కుట్ర పన్నుతున్నారని ఎంపీ సోయం బాపురావు ఆరోపించారు. తాను రెండోసారి గెలిస్తే కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని, అది ఇష్టంలేకనే టికెట్ ఇవ్వకుండా అడ్డుతగులుతున్నారని ఫైర్​అయ్యారు. ఆదివారం ఆదిలాబాద్​జిల్లా కేంద్రంలోని తన ఇంట్లో మీడియాతో బాపూరావు చిట్​చాట్​చేశారు. 

‘‘నేను ఆదివాసీ లీడర్ గా సొంతంగా ఎదిగాను. ఎవరికీ తలొగ్గే పరిస్థితి లేదు. జిల్లాలో బీజేపీని గెలిపించిందే నేను. అలాంటి నాకు టికెట్​ ఇవ్వకుండా వేరే పార్టీ నుంచి వచ్చే వారికి టికెట్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు” అని ఆయన వాపోయారు. ‘‘గత ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ కోసం ఒక్కరూ ముందుకురాలేదు. కానీ ఇప్పుడు నాకు వ్యతిరేకంగా రావడం సిగ్గుచేటు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ల గెలుపు కోసం ఎంతో కష్టపడ్డాను. సెకండ్ లిస్టు లో టికెట్ ఇవ్వకుంటే నా దారి నేను చూసుకుంటాను” అని చెప్పారు.

సీఎం రేవంత్ తో బంగారు శృతి భేటీ.. 

నాగర్​కర్నూల్​టికెట్​పై పార్టీ జనరల్​సెక్రటరీ బంగారు శృతి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు ఆ టికెట్​ఆమెకే అని అంతా అనుకున్నారు. అయితే, ఈ వారం రోజుల్లో రాజకీయ పరిస్థితులు తారుమారయ్యాయి. బీఆర్ఎస్​సిట్టింగ్​ఎంపీ రాములు బీజేపీలో చేరడం, ఆయన కుమారుడు పోతుగంటి భరత్​కు నాగర్​ కర్నూల్​ టికెట్​ఇవ్వడంతో శృతి మనస్తాపం చెందారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. ఆదివారం సీఎం రేవంత్​రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీనే అని చెప్తున్నప్పటికీ, శృతి కాంగ్రెస్​లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం. నాగర్​కర్నూల్​టికెట్ ఆమెకు ఇచ్చేందుకు కాంగ్రెస్​సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది.