- అవసరమైతే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటా: ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల/రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ధర్మాజీపేట గ్రామంలో మంగళవారం ఆయుష్మాన్ భారత్ పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే సంజయ్ మధ్య హోరాహోరీ డైలాగ్ వార్ జరిగింది. ఇద్దరూ కలిసి దవాఖానను ప్రారంభించినప్పటికీ, కార్యక్రమం మొత్తం ఇరు పార్టీల లీడర్ల నినాదాలతో రసాభాసగా మారింది. దవాఖాన ప్రారంభానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమయానికి హాజరుకాగా, ఎంపీ అర్వింద్ సుమారు రెండున్నర గంటల ఆలస్యంగా వచ్చారు.
అనంతరం ఎంపీ మాట్లాడుతూ జగిత్యాలలో ఎవరు ఏ పార్టీలో ఉన్నారో అర్థం కావడం లేదని, ఎవరు ఏ పార్టీ స్లోగన్స్ ఇస్తున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు. ఫ్లెక్సీలకు ఖర్చు చేసే డబ్బును గ్రామ అభివృద్ధికి, దవాఖానకు ఖర్చు చేసి ఉంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చేవని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను మాజీ చేసే వరకు విడిచి పెట్టలేదిలేదన్నారు.
అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎంపీ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందిస్తూ.. సభా మర్యాద లేకుండా ఎంపీ వెళ్లిపోవడం విడ్డూరమన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లే పన్నుల ద్వారానే కేంద్రానికి నిధులు వస్తాయని, రాష్ట్రాలు పన్నులు చెల్లించకపోతే కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఫెడరల్ స్పూర్తికి అనుగుణంగా రాష్ట్రాలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మాట మాట్లాడితే కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నావని, కాంగ్రెస్ ఎమ్మెల్యేవని అంటున్నారు. అవసరమైతే నేను పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
