- సోషల్ మీడియాలో పోటా పోటీగా పోస్ట్‌లు
- ఎమ్మెల్యే అనుచరులు, మైనంపల్లి అనుచరుల మధ్య వార్
- పోలీస్ స్టేషన్ లలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు
మెదక్, వెలుగు ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణలు సహజం. కానీ ఎన్నికలకు ఇంకా చాలా రోజుల సమయం ఉండగానే మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్లోని లీడర్ల మధ్య వార్ మొదలైంది. సోషల్ మీడియాలో పోటా పోటీగా పోస్టింగ్ లతో మొదలైన విభేదాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లాయి.
ముచ్చటగా మూడు వర్గాలు
మెదక్ అసెంబ్లీ పరిధిలోఇదివరకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ పొలిటికల్సెక్రటరీ శేరి సుభాష్ రెడ్డి వర్గాలు ఉండేవి. రాజకీయంగా ఇంటర్నల్‌గా వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ఎక్కడా బయట పడలేదు. నియోజకవర్గంపై పట్టు పెంచుకునే, వివిధ వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా అనూహ్యంగా గత మార్చిలో హైద్రాబాద్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే కొడుకు డాక్టర్మైనంపల్లి రోహిత్ ఎంట్రీతో మెదక్ సెగ్మెంట్ బీఆర్ఎస్లో మూడో వర్గం మొదలైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే ఆలోచనతో ఉన్న రోహిత్ నియోజకవర్గంపై పట్టు పెంచుకోవడం, ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు మైనంపల్లి సోషల్ సర్వీస్ఆర్గనైజేషన్(ఎంఎస్ఎస్) పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు.
గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్, అనాథ పిల్లలకు, ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేయడం, నిరుపేదలకు ఇళ్లు కట్టించడం వంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎంఎస్ఎస్ఓ వలంటీర్లు నియోజకవర్గంలో చేపడుతున్న యాక్టివిటీస్‌ను వాట్సప్ గ్రూప్‌లలో ప్రమోట్ చేస్తుండటంతోపాటు, కాబోయే ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గంలో ఆమె పాల్గొనే కార్యక్రమాల ఫొటోలు వాట్సప్ గ్రూప్ లలో పోస్టు చేస్తున్నారు. ఇలా ఇరువర్గాల వారు పోటా పోటీగా పోస్టులు పెడుతుండటం విభేదాలకు ఆజ్యం పోసింది.
ఫిర్యాదులతో బయటపడ్డ విభేదాలు
ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొనే ప్రోగ్రాం ఫొటోలు వాట్సప్ గ్రూప్‌లలో పోస్టు చేస్తుండగా ఇటీవల ఎంఎస్ఎస్ఓ మెంబర్ అశ్విన్ తనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించినట్టు ఎమ్మెల్యే పద్మ అనుచరుడైన మెదక్ ఏఎంసీ డైరెక్టర్ సాప సాయిలు మంగళవారం మెదక్ ఎస్పీతోపాటు, హవేలి ఘనపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన శ్రీనివాస్ తనను ఫోన్లో బెదిరిస్తున్నారని ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని వలంటీర్అశ్విన్మంగళవారం హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లికి చెందిన సాప సాయిలు ఫేక్ ఆడియోలు వాట్సప్ గ్రూప్‌లలో సర్య్కులేట్ చేస్తూ ఎంఎస్ఎస్ఓను బద్నాం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలా అటు ఎమ్మెల్యే వర్గీయులు, ఇటు మైనంపల్లి రోహిత్ వర్గీయులు పరస్పరం పోలీస్‌స్టేషన్ లలో ఫిర్యాదు చేసుకోవడం, ఆడియో క్లిప్పింగ్‌లు, ఫిర్యాదు కాపీలు వాట్సప్ గ్రూప్‌లలో పోస్టు చేయడంతో విభేదాలు రచ్చకెక్కాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అన్నచర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.