
- రూ.30 కోట్లతో మాడ వీధులు, రాజగోపురాల నిర్మాణం
- రూ.10 కోట్లతో చెరువు పూడికతీత
- రూ.13.50 కోట్లతో చెరువులో లైటింగ్
- 9 ఐలాండ్స్, గ్లాస్ బ్రిడ్జి,రోప్ వే ఏర్పాటు
- కొత్తగా వేద పాఠశాల, వాహన సేవకు రథం
చుట్టూ గుట్టలు, పచ్చని చెట్లు, చెంతనే చెరువు... వీటి మధ్య ఆహ్లాదకర వాతావరణంలో వెలసిన భద్రకాళి అమ్మవారి ఆలయం మరిన్ని హంగులను అద్దుకోనుంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ గుడి.. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి దూరమైంది. నాలుగు దశాబ్దాల తరువాత రేవంత్ సర్కార్ చొరవతో ఆలయ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. మధురైలోని మీనాక్షి ఆలయ తరహాలో ప్రభుత్వం మెరుగులు దిద్దుతోంది. ఆలయానికి మాడ వీధులు, రాజగోపురాలు కొత్త శోభను తీసుకురానుండగా.. చెరువులో ఐలాండ్స్, పైన రోప్‍వే ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ పనులకు ప్రభుత్వం సుమారు రూ.100 కోట్లకు పైగే ఖర్చు చేస్తోంది.
వరంగల్, వెలుగు: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా భావించే ఓరుగల్లు భద్రకాళి అమ్మవారి ఆలయానికి మహర్దశ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి ఒకదాని వెంట మరో ప్రాజెక్ట్ చేపడుతోంది. ఆలయానికి మణిహారంగా ఉండేలా మాడ వీధులు, చుట్టూరా రాజగోపురాల నిర్మాణ పనులు ఇప్పటికే స్పీడప్ అందుకోగా.. నాలుగు దశాబ్దాల తర్వాత భద్రకాళి చెరువు పూడికతీత పనులు చేపట్టారు. ఆలయంతో పాటు చుట్టూ ఉన్న ప్రదేశాలను కలుపుతూ.. ఐలాండ్స్, రోప్‍వే నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. దీంతో మరికొన్ని రోజుల్లో భద్రకాళి ఆలయం టూరిస్ట్ స్పాట్‌గా జనాలను ఆకట్టుకోనుంది.
టీటీడీ తరహాలో మాడ వీధులు..
కాకతీయుల కాలంలో దాదాపు 800 ఏండ్ల క్రితం నిర్మించిన అమ్మవారి ఆలయానికి చుట్టూరా టీటీడీ తరహాలో వాహన సేవల కోసం మాడ వీధులు నిర్మిస్తున్నారు. మొదట రూ.20 కోట్లు కేటాయించారు. 30 అడుగుల వెడల్పుతో ఆలయానికి మూడు వైపులా చెరువు, కొండ, లోయలను పూడుస్తూ, తవ్వుతూ పనులు చకచకా నడుస్తున్నాయి. లోయను మట్టితో పూడ్చి, అడ్డుగా కొండను జేసీబీలతో తొలిచారు. చెరువులో బ్రిడ్జి నిర్మించేందుకు నీటిని తోడారు. ఆలయానికి నాలుగు దిక్కులా రాజగోపురాలు నిర్మిస్తున్నారు. ఇందుకోసం మొదట రూ.10 కోట్లు కేటాయించారు. సీఎం రేవంత్‍రెడ్డి సూచనలతో తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ రాజగోపురాల తరహాలో భద్రకాళి ఆలయంలో నిర్మాణాలు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఆలయానికి అనుబంధంగా ఎప్పటినుంచో హనుమకొండ కాపువాడ వైపు చిన్నపాటి గదుల్లో వేద పాఠశాల నడుస్తూ ఉండేది. ఈ క్రమంలో రూ.కోటి 30 లక్షలతో నూతన వేద పాఠశాల నిర్మాణ పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు.
ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు..
భద్రకాళి ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో నిర్ణయాలు త్వరగా తీసుకునేందుకు ప్రభుత్వం తరఫున అధికారికంగా ఓ కమిటీ ఉండేలా సర్కారు అడుగేసింది. 11 ఏండ్ల తర్వాత ఇటీవల ఆలయానికి ధర్మకర్తల మండలిని నియమించింది. భద్రకాళి మాడ వీధుల్లో వాహనసేవకు అవసరమైన రథాన్ని కంచి కామాక్షి ఆలయంలో మాదిరిగా రూ.కోటి ఖర్చుతో చేయించేందుకు మండలి ఆమోదం తెలిపింది. నిత్యాన్నదానం చేసేందుకు దాతలను వెతుకుతోంది.
పూడికతీత స్పీడప్..
ఓరుగల్లు సిటీ మధ్యలో ఉండే భద్రకాళి చెరువు దాదాపు 382 ఎకరాల్లో విస్తరించి ఉండగా 50 ఏండ్ల తర్వాత మరోసారి పూడికతీత పనులు చేపట్టారు. 1994 సమయంలో భద్రకాళి చెరువు ద్వారా దాదాపు 4 లక్షల మందికి వాటర్ సప్లై చేశారు. ఆ తరువాత జిల్లాలోకి దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు ధర్మసాగర్ చెరువులోకి రావడంతో వాటిని సరఫరా చేస్తున్నారు. దీంతో భద్రకాళి చెరువులో అడవి తుంగ, వ్యర్థాలు చేరి బురద పేరుకుపోయింది. ఆలయం పక్కనే ఆహ్లాదంగా ఉండాల్సిన చెరువు రూపం కోల్పోవడంతో చక్కదిద్దేందుకు రూ.10 కోట్లు కేటాయించారు. చెరువులో 140 నుంచి 150 మిలియన్ క్యూబిక్ ఫీట్ల నీటిని బయటకు వదిలి గతేడాది నవంబర్ 8 నుంచి పూడికతీత పనులు చేస్తున్నారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా ఐలాండ్స్, రోప్ వే
పూడికతీత అనంతరం చెరువు మధ్యలో ప్రధాన ఐలాండ్‍తో పాటు ఎత్తుగా ఉన్న 8 ప్రదేశాల్లో మినీ ఐలాండ్స్ ఏర్పాటు చేసేలా పనులు నడుస్తున్నాయి. ఆలయం నుంచి ప్రధాన ఐలాండ్ కు, అక్కడి నుంచి హంటర్ రోడ్ వైపు నడకదారిలో గ్లాస్ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు అడుగులు పడ్డాయి. లైటింగ్ ఏర్పాటుకు నాలుగు రోజుల క్రితం జరిగిన జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ మీటింగ్‍లో రూ.13 కోట్ల 50 లక్షలు కేటాయిస్తూ సభ్యులు ఆమోదం తెలిపారు. బీఆర్‍ఎస్ పదేళ్ల పాలనలో నేడు రేపు అంటూ ఊరించిన వైజాగ్ మాదిరి చెరువుపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. రోప్ వే నిర్మాణానికి రూ.70 కోట్లతో పనులు చేపట్టేలా ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు.