- నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయాలి
- వరంగల్‌లో పౌరసంఘాల సదస్సు
హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలను గత ప్రభుత్వం ఆరు ముక్కలు చేయడం వల్ల చారిత్రక నేపథ్యం ఉన్న జిల్లాకు తీవ్ర నష్టం జరిగిందని పలువురు అభిప్రాయపడ్డారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలను ఒక్కటి చేసి, నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రెండు జిల్లాలను కలపాలని కోరుతూ పౌర సంఘాల ఆధ్వర్యంలో గురువారం వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో సదస్సు నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా హాజరైన ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం వరంగల్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. నగరాన్ని రెండు ముక్కలు చేయడంతో పాటు సెంట్రల్ జైలును కూలగొట్టిందని విమర్శించారు. అంతకుముందు అజాంజాహి మిల్లును సైతం కూల్చేసి ఆ భూములు అమ్ముకున్నారని, పార్కులు ఆక్రమించి పార్టీ ఆఫీస్‌లు కట్టుకున్నారని మండిపడ్డారు.
గత పాలకులు నాశనం చేసిన జిల్లా బాగు చేయాలనే ఓరుగల్లులో కాంగ్రెస్ నాయకులను గెలిపించారన్నారు. అభివృద్ధిని హైదరాబాద్‌కే పరిమితం చేస్తూ... ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ... హనుమకొండ, వరంగల్ జిల్లాలు విద్య, వైద్యంలో వెనుకబడిపోయాయన్నారు. గత పాలకులు వరంగల్ నగరాన్ని డల్లాస్ చేస్తామని చెప్పి ఖల్లాస్ చేశారన్నారు. మాజీ మేయర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ 1400 ఏండ్ల చారిత్రిక నేపథ్యం కలిగిన వరంగల్ జిల్లాను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. సమావేశంలో సీపీఎం నేత చుక్కయ్య, పౌరసంఘాల నేతలు ప్రొఫెసర్ వి.రవీందర్, టి.శ్రీనివాస్, డాక్టర్ విజయలక్ష్మి, సోమ రామమూర్తి, సాయిని నరేందర్, సంగాని మల్లీశ్వర్ పాల్గొన్నారు.
