రైతుకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ డాక్టర్ సత్యశారద

రైతుకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ డాక్టర్ సత్యశారద
  • కలెక్టర్ డాక్టర్ సత్యశారద

వరంగల్​ సిటీ, వెలుగు : రైతుకు నష్టం కలిగిస్తే చర్యలు తప్పవని, మార్కెట్లలో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి క్రయవిక్రయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పత్తి ధర,  మార్కెట్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.

 పత్తి గింజలు, బేళ్లు వర్షానికి తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. టార్పాలిన్లు (తాత్కాలిక కవర్లు) ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్ కమిటీ, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, ఇన్​చార్జి కార్యదర్శి రాము, అధికారులు, రైతులు ఉన్నారు. 

వరద ముంపునకు నివారణ చర్యలు.. 

వరంగల్ నగరంలో వరద ముంపునకు గురైన చిన్న వడ్డేపల్లి చెరువు పరిసర ప్రాంతాలు, లక్ష్మీగణపతి కాలనీ, ఎల్బీనగర్ లోని అంబేడ్కర్ నగర్  ప్రాంతాల్లో కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్​లో ముంపు సమస్య పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.