గ్రేటర్ వరంగల్, వెలుగు: అకాల వర్షం వల్ల నష్టపోయిన పంటలు, ఆస్తి వివరాల సర్వేను త్వరగా పూర్తి చేసి నివేదికలు అందజేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో నష్టంపై వివరాల నమోదుపై అధికారులతో సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాల వివరాలను వెంటనే నమోదు చేసి సమర్పించాలన్నారు.
పనుల వివరాలను రెండు రోజుల్లో అందజేయాలని ఆదేశించారు. అనంతరం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనుల ల్యాండ్ ఆక్విజేషన్ పురోగతి పై కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయ లక్ష్మి, ఆర్డీవో నర్సంపేట ఉమారాణి నేషనల్ హైవే బ్రిడ్జ్ మేనేజర్ తదితరులతో పాటు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ మంచిర్యాల్, వరంగల్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన నేషనల్ హైవే మొత్తం 176.52 హెక్టార్ల ల్యాండ్ అక్విజేషన్ కు ఇప్పటివరకు 171.34 హెక్టార్ల ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి అయిందని, పెండింగ్ ను ఈనెల 10 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. 22.02 హెక్టార్ల ల్యాండ్ ఎక్విజేషన్ కోర్టు కేసులతో పెండింగ్లో ఇప్పటివరకు పేమెంట్ అయి అవార్డ్ పాస్ అయిన కేసుల్లో మ్యుటేషన్ పూర్తి చేయాలన్నారు.
