
- వరంగల్ కలెక్టరేట్ పూర్తి కావట్లే
- 2016లో కలెక్టరేట్ఇవ్వని బీఆర్ఎస్సర్కార్
- 2021లో మంజూరు.. 2023లో శంకుస్థాపన
- 2 ఏండ్లు దాటినా పూర్తికాని నిర్మాణం
వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తికాకపోవడంతో జిల్లావాసులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించగా.. వరంగల్ లో కొత్త కలెక్టరేట్ నిర్మాణం పూర్తికాలేదు. దీంతో జిల్లా పాలన హనుమకొండ జిల్లా కేంద్రం నుంచి జరుగుతోంది. 2016లోనే హనుమకొండ జిల్లా కలెక్టరేట్ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగేండ్ల కింద ఇక్కడికి వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాకు కలెక్టరేట్మంజూరు చేయగా స్థల సేకరణకు రెండేండ్లు పట్టింది. అంతలోనే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో హడావుడిగా కలెక్టర్ ఆఫీస్ నిర్మాణానికి అప్పటి పాలకులు శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి అవసరమైన నిధులు ఇవ్వకపోవడంతో పనులు స్లోగా నడుస్తున్నాయి.
స్థలసేకరణకే రేండేండ్లు
రాష్ట్రంలో 2016 అక్టోబర్11న జిల్లాల విభజన జరిగింది. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ బిల్డింగులు నిర్మించడానికి అనుమతులు, నిధులు మంజూరు చేశారు. వరంగల్ జిల్లా కలెక్టరేట్‌కు అప్పుడు బిల్డింగ్ మంజూరు చేయలేదు. 2021లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభించేందుకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి పలువురు నేతలు ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఆయన అక్కడే కొత్త బిల్డింగ్ మంజూరు చేశారు. కొత్త కలెక్టరేట్ఎక్కడ నిర్మించాలనే విషయంలో చాలారోజులు వరకు క్లారిటీ రాకపోవడం వల్ల స్థలసేకరణలో జాప్యం జరిగింది. వరంగల్,నర్సంపేట రూట్లో అజాంజాహి మిల్ భూముల్లో 2022లో 6.16 ఎకరాలు.. 2023 లో 20.32 ఎకరాలు.. మొత్తం 27.08 ఎకరాలు వరంగల్ కలెక్టరేట్ కోసం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో 18 ఎకరాల్లో కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించారు.
బిల్డింగ్ నిర్మాణానికి 2023 జూన్ 17న శంకుస్థాపన చేయగా.. కాంట్రాక్ట్‌ను హైదరాబాద్‌కు చెందిన గౌరిశంకర్ ఇన్ఫ్రా సంస్థ దక్కించుకుంది. రూ.80 కోట్లతో 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేసేలా అగ్రిమెంట్ జరిగింది. 1లక్ష 50 వేల చదరపు అడుగుల్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ నిర్మాణానికి ఆర్అండ్బీ ఆఫీసర్లు శ్రీకారం చుట్టారు. ఎలక్షన్ల కారణంగా మొదట్లో పనుల్లో వేగం సాధ్యం కాలేదు. పనులు స్లోగా సాగగా.. ఇటీవల మంత్రి కొండా సురేఖ స్పందించారు. మంత్రి ఆదేశాలతో కలెక్టర్సత్యశారద సంబంధిత అధికారులతో మాట్లాడి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కలెక్టరేట్ బిల్డింగ్ఇంటర్నల్వర్క్స్ , కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల బంగ్లా పనులు ఇంకా పూర్తి కాలేదు. మెయిన్ ఎంట్రెన్స్, ఇంటర్నల్రోడ్లు, గార్డెనింగ్ తదితర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉన్నతాధికారులు ఫోకస్ పెడితే తప్ప దసరా నాటికి బిల్డింగ్ పూర్తయ్యే
అవకాశం లేదు.
హనుమకొండలోనే ఆఫీసులు
వరంగల్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ 9ఏండ్లుగా హనుమకొండ నుంచే సాగుతోంది. నిత్యం ఏదో ఓ సమస్యతో జనాలు 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి హనుమకొండకు రావాల్సి వస్తోంది. ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియక నానాఅవస్థలు పడుతున్నారు. కలెక్టర్ ఆఫీస్కాళోజీ జంక్షన్లో ఉంటే .. జేసీ, పోలీస్ కమిషనరేట్, డీఎంహెచ్ఓ, అగ్రికల్చర్, ఫారెస్టు, ఎక్సైజ్ తదితర కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉన్నాయి. 70 శాతం ఆఫీసులు ప్రైవేట్ బిల్డింగ్‌లలో ఉండటంతో అడ్రస్ కనుక్కోవడానికి చాలా టైమ్ పడుతుంది.