- 39 ఎజెండా అంశాలకు బల్దియా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం
వరంగల్ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం సోమవారం మేయర్ సుధారాణి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఎమ్మెల్సీ సారయ్య, వరంగల్పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. 39 ఎంజెండా అంశాలతో పాటు రూ. 130 కోట్లతో గ్రేటర్ పరిధిలో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపిన పనుల్లో ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, శానిటేషన్‌కు సంబంధించి ఉండగా, గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణ, చెరువులు, కుంటలు రక్షణకు తీసుకునే చర్యలపై చర్చించారు.
వరద వల్ల దెబ్బతిన్న ప్రతి డివిజన్ కు అత్యవసర పనుల నిమిత్తం రూ.5 లక్షలు కేటాయించారు. ప్రతి డివిజన్ కు 5 హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని, ఘన వ్యర్థాల నిర్వహణకు బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అమృత్ 2.0 లో భాగంగా వచ్చే 20 ఏండ్లకు సరిపడే అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా నిర్వహణ, నగర అభివృద్ధి పథకం కింద రూ.50 కోట్లతో బహుళార్థకంగా ఉపయోగపడే పనులు చేయాలని, 66 డివిజన్ లలో 198 మంది వలంటీర్ల ద్వారా తడి, పొడి చెత్త పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మాణించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన 6,400 కుటుంబాలకు రూ.15,000లు అందించినట్లు మేయర్ తెలిపారు.
