వరంగల్, వెలుగు: వరంగల్ కమిషనరేట్ పరిధిలోనీ రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని, రోడ్లపై బర్త్డే వేడుకలు చేస్తే యాక్షన్ తీసుకోవాలని సీపీ సన్‍ప్రీత్‍సింగ్ పోలీస్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని కిట్స్ కాలేజీలో అధికారులతో సీపీ క్రైమ్ రివ్యూ నిర్వహించారు. ప్రతి పీఎస్లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, వారు వందశాతం హాజరయ్యేలా చూడాలన్నారు. స్టేషన్ అధికారులు నెలలో ఓసారి రౌడీషీటర్ల ఇండ్లను సందర్శించి తనిఖీలు చేపట్టి, వారి కదలికలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు.
నేరాల నియంత్రణలో భాగంగా రాత్రి సమయాల్లో బెల్ట్ షాపులను మూయించాలని, విననివారిపై కేసులు నమోదు చేసి బైండోవర్ చేయాలన్నారు. స్టేషన్ ఆఫీసర్ ఖచ్చితంగా ఉదయం 9 గంటలకు స్టేషన్లో బాధితులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. సమావేశంలో డీసీపీ అంకిత్ కుమార్, దార కవిత, రాజమహేంద్ర నాయక్, అడిషనల్ డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.
