ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జనగామ, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లు రావొద్దని కలెక్టర్ సీహెచ్​ శివలింగయ్య ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో ఐకేపీ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతీ కేంద్రంలో ఐదుగురు సభ్యులు ఉండాలన్నారు. గన్నీ బ్యాగ్స్, మాయిశ్చర్ మీటర్లు, వెయింగ్ మెషిన్లు, టార్పలీన్ల కోసం ఆఫీసర్లను సంప్రదించాలన్నారు. ప్రతీ కేంద్రంలో బ్యానర్లు ఏర్పాటు చేసి, వాటిపై మద్దతు ధరలు, ఆఫీసర్ల ఫోన్ నెంబర్లు పెట్టాలన్నారు. ధాన్యం తూకం వేయడం నుంచి మొదలు గోదాంలకు చేర్చే వరకు ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. ‘ఏ’ గ్రేడ్ వడ్లకు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దత ధర నిర్ణయించామన్నారు. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్​డీవో రాంరెడ్డి తదితరులున్నారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

నర్సంపేట, వెలుగు: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ వెంకటలక్ష్మీ అన్నారు. నర్సంపేట మండలం లక్నేపల్లి విలేజ్​లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలను గురువారం డీసీపీ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని...  దొంగతనాలు, యాక్సిడెంట్లు జరిగినప్పుడు కేసులను ఈజీగా పరిష్కరించే చాన్స్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ సంపత్​రావు, సీఐ పులి రమేశ్, ఎస్సైలు రవీందర్​, సురేష్​లు ఉన్నారు. అనంతరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో డీసీపీ పాల్గొన్ని రక్తదానం చేశారు. దాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

చేపలు పట్టిండని చితకబాదిన్రు

నల్లబెల్లి, వెలుగు: చెరువులో ఓ నలుగురు వ్యక్తులు రాత్రి వేళ చేపలు పడుతుండగా.. గ్రామస్తులు ఒకరిని పట్టుకుని చితకబాదారు. ఆ వలలతోనే చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆపై సర్పంచులు ఆ వ్యక్తితో బేరసారాలకు దిగారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అర్షనపల్లి జీపీ పరిధిలోని బోల్లోనిపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కన్నారావుపేట శివారు పద్మపురం గ్రామానికి చెందిన ఈసాల జగన్​తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు.. బుధవారం రాత్రి బోల్లోనిపల్లి ఊరచెరువులో చేపలు పట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని వెంబడించారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు పారిపోగా.. జగన్ మాత్రం గ్రామస్తులకు చిక్కాడు.
రాత్రంతా కట్టేసిన్రు..
గ్రామస్తులకు దొరికిన జగన్ ను చితకబాది, ఆ వలతోనే చెట్టుకు కట్టేశారు. రాత్రంతా అతన్ని చెట్టుకే ఉంచారు. ఉదయం మళ్లీ కొట్టారు. మిగిలిన ముగ్గురి పేర్లు చెప్పినా వదిలిపెట్టలేదు. అర్షనపల్లి సర్పంచ్ భర్త తిప్పని లింగమూర్తి, కన్నరావుపేట సర్పంచ్ భర్త రవీందర్ రెడ్డి, మరో సర్పంచ్ కలిసి బేరసారాలకు దిగారు. రూ.25వేలకు రాజీ కుదిర్చి.. కాగితం రాసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత వ్యక్తిని వదలిపెట్టారు.
‘మాకు ఎవరూ చెప్పలే’
చేపలు పట్టిన ఘటనలో వ్యక్తిని కొట్టిన విషయం పోలీసులకు గురువారం ఉదయం తెలిసింది. అయితే పిటిషన్ ఎవరూ ఇవ్వకపోవడం, డయల్ 100కు కూడా కాల్ రాకపోవడంతో లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత జగన్​ను కొట్టిన  వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. జగన్ ను అదుపులోకి తీసుకున్నారు. సర్పంచ్, సర్పంచుల భర్తలతో మాట్లాడుతున్నారు.

పనులకు పైసల్ లేవంటే ఎట్ల?

జనగామ, వెలుగు: ‘వార్డుల్లో పనులు చేసేందుకు పైసలు లేనప్పుడు మీటింగులెందుకు? జనరల్ బాడీ మీటింగ్ తో ప్రయోజనం ఏంటి? అధికార పార్టీ వార్డులను ఒకలా.. విపక్ష పార్టీల వార్డులకు మరోలా చూస్తున్నరు’ అంటూ జనగామ పట్టణ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జనగామ మున్సిపల్​ కాన్ఫరెన్స్ ​హాల్​లో చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య అధ్యక్షతన మున్సిపల్​జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. తన వార్డులో పనులు జరగడం లేదని 17వ వార్డు కౌన్సిలర్​ జక్కుల అనిత వేణుమాధవ్ వాపోయారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. దీంతో అధికార పార్టీ కౌన్సిరల్ ​పాండు అడ్డు చెప్పబోగా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అనిత పోడియం ముందు కూర్చుని నిరసన తెలిపింది. ఆమెకు కాంగ్రెస్, బీజేపీ సభ్యులు మద్దతు తెలిపారు.

‘ఎజెండాలో అక్కెరకు రాని అంశాలు’
మున్సిపల్​ మీటింగ్​ఎజెండా అంశాల్లో అక్కెరకు రాని విషయాలే ఎక్కువగా పొందుపరుస్తున్నారని బీజేపీ కౌన్సిలర్​ మహంకాళి హరిశ్చంద్ర గుప్త ఆరోపించారు. వార్డుల్లో అభివృద్ధి పనులకు డబ్బులు లేవని చెప్పడం.. వార్డులకు సంబంధం లేని బిల్లులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిధుల కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ద్వారా ప్రయత్నాలు చేయాలని కోరారు. ప్రతినెలా తప్పనిసరిగా బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలన్నారు. వార్డుల్లో చాలామంది అర్హులకు పెన్షన్లు రావడం లేదన్నారు. అధికార పార్టీ కౌన్సిలర్​ దేవరాయ నాగరాజు మాట్లాడుతూ.. ఎప్పుడు పనుల గురించి అడిగినా పైసలు లేవని అంటున్నారని, అల్లాంటప్పుడు మీటింగ్ ఎందుకని ప్రశ్నించారు.  పలువురు సభ్యులు మాట్లాడుతూ టౌన్​ లో పారిశుధ్యం అధ్వాన్నంగా మారిందన్నారు. మున్సిపల్​ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని కోరారు. సమావేశంలో మున్సిపల్​ కమిషనర్​ రజిత, వైస్​ చైర్మన్​ మేకల రాంప్రసాద్​, కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.

జాతర పనుల్లో నిర్లక్ష్యం తగదు

రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 7 నుంచి 12 వరకు బుగులోని జాతర నిర్వహించనున్నారు. గురువారం జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్థానిక రైతు వేదికలో రివ్యూ నిర్వహించారు. జాతర పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. వచ్చే నెల 4లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంచినీటి కొరత లేకుండా చూడాలన్నారు. కరాబ్ అయిన రోడ్లకు రిపేర్లు చేపట్టాలన్నారు. జాతర విజయవంతానికి ఫారెస్ట్ ఆఫీసర్లు సహకరించాలన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు  నడపాలన్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జాతర నిర్వహణ కమిటీ చైర్మన్ కడారి జనార్దన్, ఎంపీపీ పున్నం లక్ష్మీ, జడ్పీటీసీ సాయిని విజయ  ముత్యం తదితరులున్నారు.

పోడు సర్వే స్పీడప్ చేయాలె

ములుగు, వెలుగు: ములుగు జిల్లాలో పోడు సర్వే స్పీడప్ చేయాలని.. వచ్చే నెల 5లోగా పూర్తి కావాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. గురువారం పోడు సర్వేపై కలెక్టరేట్​లో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడారు. మండలాల వారీగా సర్వే తీరును తెలుసుకున్నారు. ఆర్వోఎఫ్ఆర్ మొబైల్ యాప్ ద్వారా పోడు వివరాలు వెంటనే నమోదు చేయాలన్నారు. ఇప్పటివరకు 58శాతం మాత్రమే సర్వే పూర్తి అయిందని వెంటనే, మిగిలిన టార్గెట్ చేరుకోవాలన్నారు. రోజూ ఒక్కో మండలంలో 200 దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. క్లెయిమ్స్ సమర్పించినప్పటికీ సాగులో లేని పోడు  భూముల దరఖాస్తులను  క్లోజ్ చేయాలని ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, రెవెన్యూ  ఆఫీసర్ రమాదేవి తదితరులున్నారు.

ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి..

నెల్లికుదురు(కేసముద్రం), వెలుగు: ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలకేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కేసముద్రానికి చెందిన కోడి చందు(11) గురువారం సాయంత్రం సైకిల్ తొక్కుతూ రోడ్డుపైకి వెళ్లాడు. ఇంతలో ట్రాక్టర్ అతన్ని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కరెంట్ షాక్ తో మహిళ మృతి
తొర్రూరు(పెద్దవంగర), వెలుగు: కరెంట్ షాక్ తో మహిళ మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం బొమ్మకల్ గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గిరగాని ధనమ్మ(45) గురువారం ఉదయం తడి దుస్తులు దండెంపై ఆరేసింది. దండెం  కరెంట్ వైర్​కు ఆనుకోవడంతో షాక్ కొట్టి స్పాట్​లో చనిపోయింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.