వరంగల్ వరద బాధితులకు రూ.12.12 కోట్ల పరిహారం ..11 రోజుల్లోనే సీఎం రేవంత్ ఇవ్వడం ఓ చరిత్ర

వరంగల్ వరద బాధితులకు రూ.12.12 కోట్ల పరిహారం ..11 రోజుల్లోనే సీఎం రేవంత్ ఇవ్వడం ఓ చరిత్ర
  • గతంలో వరదదలు వస్తే.. తండ్రీకొడుకులు చీపురుపుల్ల కూడా ఇవ్వలేదు
  • మాజీ మంత్రి హరీశ్​ అవినీతిపై ఫిర్యాదు చేస్తాం
  • జయలలితలా కవిత తిరిగితే జనాలు నమ్మరు
  • ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, ఎంపీ కడియం కావ్య కామెంట్స్

వరంగల్‍, వెలుగు :  గ్రేటర్‍ వరంగల్ లో 2020 నుంచి 2022 వరకు వచ్చిన వరదలతో సిటీ నీట మునిగితే.. కేసీఆర్‍, కేటీఆర్‍ వచ్చి కారుకు కారు, బండికి బండి ఇస్తామని చెప్పి వెళ్లారు తప్పితే..చీపురు పుల్ల కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్‍.నాగరాజు, ఎంపీ కడియం కావ్య విమర్శించారు.  

సీఎం రేవంత్‍రెడ్డి కేవలం 11 రోజుల వ్యవధిలో రూ.15 వేల చొప్పున నష్టపరిహారం అందించడం ఓ చరిత్ర అని పేర్కొన్నారు. గురువారం హనుమకొండ కాంగ్రెస్‍ భవన్ లోనిర్వహించిన  ప్రెస్‍మీట్‍ లో వారు మాట్లాడారు. గ్రేటర్‍ వరంగల్ వరద బాధితులను ఆదుకోవాలనే ఆరాటంతో 8,080 దెబ్బతిన్న ఇండ్లకు, 6 వేలమందికి రూ.12 .12 కోట్లను పరిహారం కాంగ్రెస్‍ ప్రభుత్వం అందించిందని తెలిపారు. 

మాజీ సీఎం కేసీఆర్ కూతురు బుజ్జమ్మ (కవిత) తండ్రి సంపాదించిన అక్రమ ఆస్తులతో అన్ని అనుభవించి, షాప్స్ ఓపెనింగ్‍ పేరుతో బంగారు నగలు, ఖరీదైన చీరలు తీసుకున్నారని, ఇప్పుడు కూడా సిటీలో ఆమెకు ఎవరో బినామీ ఉన్నందునే పర్యటనకు వచ్చారని ఆరోపించారు. ఇప్పుడు కవిత వెంట్రుకలను ముడేసుకుని జయలలిత మాదిరిగా తిరిగితే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. 

బీఆర్ ఎస్ హయాంలో బీఆర్‍ఎస్‍ ఎమ్మెల్యేలను గెలిపించాలని సిటీ అంతా తిరిగి ప్రచారం చేసిన కవితకు పార్టీ నేతల కబ్జాలు తెలియవా..? అని ప్రశ్నించారు. వరంగల్‍ సెంట్రల్‍ జైలు జాగాలో నిర్మించే సూపర్‍ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంలో మాజీ మంత్రి హరీశ్​రావు రూ.600 కోట్ల అవినీతి చేశాడనే ఒక్కనిజం మాత్రమే ఆమె మాట్లాడారన్నారు. హరీశ్ రావు అవినీతిపై తాము మరోసారి ఫిర్యాదు చేస్తామన్నారు. 

అప్పుడు దాసోజు శ్రావణ్‍ కూడా వచ్చి కేసీఆర్‍, కేటీఆర్‍, హరీశ్ రావును తిట్టివెళ్లాడని.. ఇప్పుడేమో మోకరిల్లి మాట్లాడుతున్నాడని వారు మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబాన్ని వరంగల్‍ జనాలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. త్వరలో అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజీ పనులకు మోక్షం రాబోతున్నట్లు తెలిపారు. 

మొంథా తుఫాన్‍ బాధితులను ఆదుకోవడంతో పాటు వరదలకు కారణమైన గోపాల్‍పూర్‍ ఊర చెరువును అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రెస్ మీట్ లో మేయర్‍ గుండు సుధారాణి, వరంగల్‍ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్‍ ఇనగాల వెంకట్రామిరెడ్డి, నేతలు పాల్గొన్నారు.