- రూ.5,257 కోట్లతో గ్రేటర్ వరంగల్‍కు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
- రూ.1,371 కోట్లతో 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
- యూజీడీ పనుల నిర్వహణకు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పెద్ద పరీక్ష
- ఐఏఎస్ ఆఫీసర్ల కోసం ప్రపోజల్స్ పెట్టిన గ్రేటర్ ప్రజాప్రతినిధులు
వరంగల్, వెలుగు: ఓరుగల్లు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో ఇక్కడి బడా ప్రాజెక్టుల నిర్వహణను పెద్దాఫీసర్లకు అప్పజెప్పే అవకాశం కనిపిస్తోంది. ఓరుగల్లు చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా భావించే రూ.5,257 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఒకటికాగా, వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో రూ.1,371 కోట్లతో నిర్మిస్తున్న 24 అంతస్తుల మల్టీలెవల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెయింటనెన్స్ మరొకటి. జిల్లా పరిధిలోని ఈ రెండు ప్రధాన ప్రాజెక్టుల కోసం ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లను కేటాయించాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పెద్దలకు ప్రపోజల్స్పెట్టారు.
ఓరుగల్లు అండర్ డ్రైనేజీ.. బిగ్ సవాల్
ఓరుగల్లులో చరిత్రలోనే వరంగల్ నగరానికి అండర్‍గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం అతి పెద్ద ప్రాజెక్ట్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, మామునూర్ ఎయిర్‍పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ వంటి ప్రాజెక్టులన్నీ గరిష్టంగా రూ.700 కోట్ల నుంచి రూ.1,000 కోట్లుగా ఉన్నాయి. కాగా, అండర్‍గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) ప్రాజెక్ట్ విలువ ఏకంగా రూ.5,257 కోట్ల 20 లక్షల భారీ ప్రాజెక్ట్అవుతోంది.
ఇటీవలే దీనికి సంబంధించి నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏప్రిల్ లో పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ప్రధానంగా జీడబ్ల్యూఎంసీలోని వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల పరిధిలో పనులు చేపట్టాల్సి ఉంది.
మాస్టర్‍ప్లాన్ 2050 దృష్టిలో ఉంచుకుని 2,739 కిలోమీటర్ల యూజీడీ నెట్వర్క్నిర్మించాల్సి ఉంది. 66 డివిజన్లు, 42 విలీన గ్రామాల్లో భవిష్యత్తులో 22 లక్షల జనాభాకు అనుగుణంగా గ్రేటర్‍లో 2 లక్షల 92 వేల 194 ఇండ్లకు సీవరేజీ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. వీటికోసం 23 ఎస్‍టీపీలు, 7 సీవేజ్ పంపింగ్ స్టేషన్లు, 12 కమ్యూనిటీ స్టెబిలైజేషన్ ట్యాంకుల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మెగా ప్రాజెక్టును 4 ప్యాకేజీలు, 9 జోన్లు, 13 సబ్ జోన్లుగా విభజించి, రాబోయే 2 నుంచి 3 ఏండ్లలో పూర్తిచేసేలా పాలకులు లక్ష్యం పెట్టుకున్నారు.
చాలెంజ్‍గా హాస్పిటల్ మెయింటనెన్స్..
వరంగల్ సెంట్రల్ జైల్ కూల్చిన స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల మల్టీలెవల్ సూపర్ హాస్పిటల్ నిర్మాణంతో రాష్ట్ర సర్కారు ఉత్తర తెలంగాణకు హెల్త్ హబ్‍గా మార్చబోతోంది. దీనికి అనుబంధంగా కేఎంసీ ఆవరణలోని పీఎంఎస్‍ఎస్‍వై సూపర్ స్పెషల్ హాస్పిటల్, ఎంజీఎం, ఐ హాస్పిటల్స్రానున్నాయి. రూ.1,371 కోట్లతో 24 అంతస్తుల్లో నిర్మించే హాస్పిటల్లో 2,018 బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
19 లక్షల 70 వేల 605 ఎస్‍ఎఫ్‍టీ స్థలంలో నిర్మిస్తున్న హాస్పిటల్లో 10 నుంచి 15 రకాల క్రిటికల్ కేర్ ట్రీట్‍మెంట్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాదిమంది డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు, టెక్నిషియన్లు, సిబ్బంది పనిచేయనున్నారు. అయితే వివిధ జిల్లాల నుంచి వచ్చే పేషెంట్లకు సరైన సేవలు అందించే క్రమంలో హాస్పిటల్ నిర్మాణం కంటే దీని మెయింటనెన్స్నయా చాలెంజ్ అవనుంది.
జీడబ్ల్యూఎంసీకి టెంపరరీ ఐఏఎస్ కమిషనర్..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చూసేందుకు ప్రస్తుతం టెంపరరీ కమిషనర్ విధులు నిర్వహిస్తున్నారు. సిటీలో వాటర్ ప్రాబ్లం, చెత్త సేకరణ సవాల్‌గా ఉంది. స్మార్ట్ సిటీ, కుడా ప్రాజెక్టులు ఇలా మరెన్నో పనులను కమిషనర్‍గా ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షించాల్సి ఉంది. ఈ క్రమంలో ఇన్నాళ్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍గా ఉన్న చాహత్ బాజ్‍పాయ్‍ను ఇటీవలే హనుమకొండ జిల్లా కలెక్టర్‍గా బదిలీ చేశారు.
అదే సమయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍గా, కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ (కుడా) వైస్ చైర్మన్‍గా ఆమెనే అదనపు బాధ్యతల్లో ఉన్నారు. ఒక్కో డిపార్టుమెంట్లో పూర్తిస్థాయి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడే ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోగా, ఇప్పుడు 3 ప్రధాన శాఖలకు చాహత్ బాజ్‍పాయ్ రూపంలో ఒకే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు.
పనులు కావాలంటే.. ఐఏఎస్ ఆఫీసర్లను ఇయ్యాలే
ఓరుగల్లును అభివృద్ధి చేసే క్రమంలో యూజీడీ, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరహా ప్రాజెక్టుల నిర్వహణకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను కేటాయించాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ప్రపోజల్ రెక్వెస్ట్పెట్టారు. రూ.5,257 కోట్ల యూజీడీ ప్రాజెక్టును సక్రమంగా నిర్మించే క్రమంలో సీనియర్ ఐఏఎస్ ప్రధానంగా ఉంటూ వరంగల్, హనుమకొండ కలెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ కమిషనర్, కుడా చైర్మన్, ఇరిగేషన్, ఆర్‍అండ్ బీ, పంచాయతీరాజ్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ వంటి ప్రధాన శాఖల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను డెవలప్‍మెంట్ కమిటీలో బాధ్యులను చేర్చాలని కోరారు.
తద్వారా పనులు చేపట్టే ప్రాంతాల్లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసేలా ప్రత్యేక ఫోకస్ పెట్టే ఆఫీసర్‍ను ఇవ్వాలని రెక్వెస్ట్ చేశారు. 24 అంతస్తుల హాస్పిటల్ మెయింటనెన్స్ విషయంలోనూ విద్యుత్ శాఖ టీజీఎన్‍పీడీసీఎల్ తరహాలో ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‍ను నియమించాలని కోరారు. కాగా, సీఎం ఈ రెండు ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవానికి వచ్చే సమయంలోగా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
