గడ్డి మందు పారాక్వాట్ ను నిషేధించాలి : వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య

గడ్డి మందు పారాక్వాట్ ను నిషేధించాలి : వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య
  •     ‘జన్ విశ్వాస్’ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
  •     లోక్‌సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య

న్యూఢిల్లీ, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణాంతకంగా మారిన గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ పై నిషేధం విధించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారు. గడ్డి మందు అనేది ఆత్మహత్యలకు ఒక "మరణాయుధం"గా మారిందని, ఇది తాగిన ప్రతిఒక్కరూ మరణిస్తున్నారని కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. 

దీనికి ఇప్పటివరకు విరుగుడే లేదని.. ఐఎంఏ వంటి వైద్య సంస్థలు కూడా దీని నిషేధాన్ని కోరుతున్నాయని గుర్తు చేశారు. ఇది పర్యావరణాన్ని, వ్యవసాయ ఉత్పత్తులను విషతుల్యం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని సభ దృష్టికి తెచ్చారు. అలాగే, కేంద్రం ప్రవేశపెట్టిన ‘జన్ విశ్వాస్ (సవరణ) బిల్లు’ను తాము వ్యతిరేకిస్తున్నట్లు ఎంపీ కావ్య స్పష్టం చేశారు. 

వ్యాపార సౌలభ్యం పేరుతో కీలక నిబంధనలను డీక్రిమినలైజ్ చేయడం వల్ల నియంత్రణ వ్యవస్థ బలహీనపడుతుందని హెచ్చరించారు. శిక్షలను తగ్గించడం వల్ల ఉల్లంఘనలు పెరిగి ప్రజా ఆరోగ్యం, పర్యావరణం, కార్మిక హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. వ్యాపారాలకు అనుకూలత కల్పించడమే కాకుండా, సామాన్యుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని, ఇలాంటి సవరణలపై విస్తృత చర్చ జరపాలని ఆమె సూచించారు.