హనుమకొండ, వెలుగు: వరంగల్ నిట్లో డొమెస్టిక్ ప్యాకేజీ ప్లేస్ మెంట్ సీజన్ 2025–-26లో కొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్లో ఉత్తర్ప్రదేశ్ నోయిడాకు చెందిన నారాయణ త్యాగికి ఓ మల్టీనేషనల్ కంపెనీ రూ.1.27 కోట్లతో భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది. ఇది నిట్ చరిత్రలోనే అత్యధిక ప్యాకేజీ. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన మొహమ్మద్ నహిల్ నష్వాన్ రూ.కోటి ఆఫర్ పొందాడు.
దీంతో వరంగల్ నిట్ దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో మేటిగా నిలిచినట్లయ్యింది. 2025–-26 ప్లేస్ మెంట్ డ్రైవ్ ప్రారంభమైన రెండు నెలల వ్యవధిలోనే 528 మందికిపైగా విద్యార్థులు అత్యుత్తమ ప్యాకేజీలు పొందారు. ఇందులో ఆరుగురు రూ.70 లక్షల ప్యాకేజీ పొందగా.. 34 మంది రూ.50 లక్షలు, 125 మంది రూ.30 లక్షలు, 163 మంది రూ.25 లక్షలు, 200 మంది రూ.20 లక్షలకుపైగా ప్యాకేజీ దక్కించుకున్నారు. ప్లేస్ మెంట్ సాధించిన విద్యార్థులను నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి అభినందించారు.
