హనుమకొండ, వెలుగు: స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జైలుశిక్ష తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ హెచ్చరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ కార్యక్రమంలో భాగంగా విద్యాసంస్థల వద్ద పొగాకు ఉత్పత్తుల విక్రయాల నిషేధానికి సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విద్యాసంస్థల సమీపంలో గుట్కా, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే సిగరెట్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్–2003 కింద కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జువెనైల్ జస్టిస్ యాక్ట్–2015 సెక్షన్ 77 ప్రకారం చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఎవరైన సిగరెట్లు అమ్ముతున్నట్టు తెలిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, వరంగల్ ట్రాఫిక్ సీఐ సుజాత, ఏఎస్ఐ రాజేందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
