- హనుమకొండ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
- తెలంగాణలోని 33 జిల్లాల నుంచి హాజరుకానున్న యువత
- ప్రతిరోజూ 800 మందికి ఫిజికల్, మెడికల్ టెస్టులు
వరంగల్, వెలుగు: ఇండియన్ ఆర్మీలో ‘అగ్నివీర్’ జవాన్ల ఎంపిక ప్రక్రియకు ఓరుగల్లు వేదికైంది. ఆర్మీ చెన్నై జోన్, సికింద్రాబాద్ రిక్రూట్‌మెంట్ ఆఫీస్ సమన్వయంతో ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు ఈ ఎంపికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సుమారు 8 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఒక్కో రోజు రెండు, మూడు జిల్లాల క్యాండిడేట్లకు సెలక్షన్స్ నిర్వహించనున్నారు.
రోజుకు 800 మందికి టెస్ట్‌లు
అగ్నివీర్ నియామక ప్రక్రియలో ప్రతి రోజు 800 చొప్పున మొత్తం 7,956 మందికి ఫిజికల్, మెడికల్ టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం జిల్లాల వారీగా ప్రత్యేకంగా తేదీలను కేటాయించారు. నవంబర్ 10న ఆదిలాబాద్, వనపర్తి జిల్లాకు చెందిన అభ్యర్థులకు టెస్ట్‌లు మొదలుకానుండగా... 11న నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, 12న కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‍నగర్, 13న భూపాలపల్లి, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాల నుంచి వచ్చిన యవతకు టెస్ట్‌లు నిర్వహించనున్నారు.
అలాగే 14న జోగులాంబ గద్వాల, యాదాద్రి, ములుగు, నారాయణపేట, ఖమ్మం, 16న వికారాబాద్, మేడ్చల్, నాగర్‌కర్నూల్, 17న నిర్మల్, రాజన్న సిరిసిల్ల, 18న మంచిర్యాల, పెద్దపల్లి, హైదరాబాద్, 19న సిద్దిపేట, కరీంనగర్, జనగామ, మహబూబాబాద్, 20న జగిత్యాల, నల్గొండ, వరంగల్, హనుమకొండ జిల్లాల అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. మధ్యలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. మరో రోజు టెస్ట్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
తెల్లవారుజామునే టెస్ట్‌లు స్టార్ట్
అగ్నివీర్ ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రతి రోజు తెల్లవారుజామునే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. తెల్లవారుజామున నాలుగు, ఐదు గంటల నుంచే రన్నింగ్, లాంగ్ జంప్, చెస్ట్, జిగ్‍జాగ్, చిన్ అప్స్ అండ్ బీమ్స్, పుషప్స్ వంటి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. నియామక ప్రక్రియ నిర్వహించే ముందే ప్రతి రోజు 800 మందికి సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. దీంతో అర్ధరాత్రి 12 దాటాక రిక్రూట్‌మెంట్ సైట్ ఓపెన్ కాగానే ప్రాసెస్ చేసేలా చర్యలు చేపట్టారు.
భారీ బందోబస్తు..
అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నెహ్రూ స్టేడియం చుట్టూ భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. హనుమకొండ బస్టాండ్‍తో పాటు స్టేడియం బయట, లోపల కలిపి మొత్తం 200 మంది పోలీసులు డ్యూటీలో ఉండనున్నారు. కాగా ఎంపిక ప్రక్రియ జరిగినన్ని రోజులు స్టేడియంలోకి అర్హులైన అభ్యర్థులు తప్పించి.. వాకర్స్, ప్లేయర్స్‌తో పాటు ఇతరులు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్, డీసీపీ అంకిక్ కుమార్ కలిసి.. రిక్రూట్‌మెంట్ ఏర్పాట్లు, బందోబస్త్‌ను పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా ఉద్యోగాలు ఇస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని ఆఫీసర్లు సూచించారు. అలా ఎవరైనా మోసం చేయాల్ని చూస్తే... వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు.
