మహిళా, శిశు సంక్షేమమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలి : ఐసీడీఎస్ ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి

మహిళా, శిశు సంక్షేమమే లక్ష్యంగా సిబ్బంది పని చేయాలి : ఐసీడీఎస్ ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీబాయి

కల్లూరు, వెలుగు : మహిళా, శిశు సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఐసీడీఎస్ సిబ్బంది పనిచేయాలని వరంగల్ రీజియన్ ఆర్ జేడీ ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారు. కల్లూరు సెక్టార్ సూపర్​వైజర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో కల్లూరు మున్సిపాలిటీ ఆవరణలో మంగళవారం నిర్వహించిన పోషణమాసం కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి మాట్లాడారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో  ఆధునిక పద్ధతిలో సేవలు అందించడానికి నూతన విధానం తీసుకొచ్చామని, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహార లోపం సమస్యలు లేకుండా చూడాలన్నారు. గర్భిణీ గా గుర్తించిన వెంటనే  అంగనవాడీ కేంద్రంలో పేరు నమోదు చేసుకొని టీచర్లు ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని చెప్పారు. 

అంగన్​వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషక విలువలు కలిగిన ఆహారం అందిస్తూ, ఆరోగ్య శాఖ సహకారంతో వ్యాధి నిరోధక టీకాలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ  అధికారి రామ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకున్నట్లయితే రక్తహీనత సమస్యలు లేకుండా  సుఖ ప్రసవం జరుగుతుందన్నారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు నిర్వహించారు. కార్యక్రమంలో సీడీపీఓ నిర్మల జ్యోతి, ఏసీడీపీఓ రత్తమ్మ, సూపర్​వైజర్లు సుజాత, భవాని, వెంకటమ్మ పాల్గొన్నారు.