- నిత్యం 350 నుంచి 400 వరకు ఓపీ నమోదు
- సగటున రోజుకు 30 మందికి ఆపరేషన్లు
- నిరుడు దాదాపు 7,212 మందికి సర్జరీలు
- ఈ ఏడాది ఇప్పటివరకు 2 వేల మందికిపైగా కంటిచూపు
- వైద్య సిబ్బంది చొరవతో రోగులకు మెరుగైన సేవలు
- ఆస్పత్రిని అప్ గ్రేడ్ చేస్తే మరింత మేలు
హనుమకొండ, వెలుగు: ఇటీవలి కాలంలో చిన్నాపెద్దా తేడాలేకుండా అందరిలోనూ కంటి సమస్యలు కామనయ్యాయి. ముసలోళ్ల నుంచి ఇప్పుడిప్పుడే బడికి వెళ్తున్న పిల్లల దాకా అందరినీ ఐ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. ట్రీట్మెంట్ కోసం ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్తే రూ.లక్షల్లో ఖర్చు. కానీ, వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల పైసా ఖర్చు లేకుండా మసకబారిన కండ్లలో మళ్లీ వెలుగులు నింపుతోంది.
ఆస్పత్రిలో అడ్మిట్ అయినప్పటి నుంచి ఆపరేషన్ అయి డిశ్చార్జ్ చేసేంతవరకు వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో గతానికి భిన్నంగా రోజురోజుకూ ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇదివరకు ఈ ఆస్పత్రికి పెద్దగా ఆదరణ లేకపోయినప్పటికీ ఇక్కడ డాక్టర్ల చొరవతో ఏటా వేల మందికి కంటి చూపు దక్కుతోంది.
అడ్మిట్ నుంచి డిశ్చార్జ్ వరకు స్పెషల్ ఫోకస్..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1990లో కర్నూలు, విశాఖపట్నం, వరంగల్ లో ప్రాంతీయ నేత్ర వైద్యశాలలను ఏర్పాటు చేసింది. వరంగల్ ఎంజీఎం సమీపంలో 75 బెడ్లతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయగా, అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. కానీ చుట్టూ పదుల సంఖ్యలో ప్రైవేటు హాస్పిటల్స్ ఏర్పడటం, ఆ తర్వాతి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కొన్నాళ్ల కిందటి వరకు ఈ ఆస్పత్రికి పెద్దగా ఆదరణ లేదు. కొంతకాలంగా ఇక్కడి వైద్యాధికారులు రీజినల్ ఐ హాస్పిటల్ సేవలపై ఫోకస్ పెట్టారు.
రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యం అందించడం, పేషెంట్ల హక్కులు, బాధ్యతలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ వరకు వారికి అందుతున్న సేవలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.భరత్ కుమార్ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి, వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ సేవలందిస్తున్నారు. దీంతో ట్రీట్మెంట్ కోసం రోగులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అప్ గ్రేడ్ చేస్తే మేలు..
వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్ ను ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు ఇలా అన్నీ కలిపి 82 పోస్టులు మంజూరు చేశారు. అందులో ప్రధానమైన 55 పోస్టులు భర్తీ అయినప్పటికీ 27 వెకెన్సీలున్నాయి. ఇందులో ఆపరేషన్ల సమయంలో కీలకమైన అనస్థీషియన్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆపరేషన్ల సమయంలో ఎంజీఎం నుంచి అనస్థీషియా సిబ్బంది రావాల్సి వస్తోంది. గ్రేడ్-2 ల్యాబ్ టెక్నిషియన్ పోస్టు కూడా ఖాళీగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పెరుగుతున్న రోగుల తాకిడి దృష్ట్యా 75 బెడ్లతో ఉన్న రీజినల్ ఐ హాస్పిటల్ ను 150 బెడ్లకు అప్ గ్రేడ్ చేయాలనే ప్రతిపాదన ఉంది. దాదాపు 30 ఏండ్ల కిందటి బిల్డింగ్ కావడంతో కొన్నిచోట్ల పెచ్చులూడి పడుతున్నాయి. ఇక్కడి సమస్యలన్నీ పరిష్కరించి అప్ గ్రేడ్ చేస్తే రోగులకు మరింత మేలైన సేవలందే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చొరవ చూపాలని రోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.
డైలీ 350కిపైగా ఓపీ.. 30 వరకు సర్జరీలు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు చత్తీస్ గడ్, మహారాష్ట్ర నుంచి పేషెంట్లు తరలివస్తుండటంతో వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్ లో నిత్యం 350 నుంచి 400 వరకు ఓపీ నమోదవుతోంది. గతేడాది మొత్తంగా 93 వేలకుపైగా ఓపీ నమోదవడం గమనార్హం. ప్రతిరోజు వందల సంఖ్యలో ఓపీ నమోదవుతుండగా, సగటున 30 నుంచి 35 మంది ఐపీగా అడ్మిట్ అవుతున్నారు.
ఇందులో కాటరాక్ట్, రెటీనా సమస్యతో వస్తున్న వారే అధికంగా ఉంటున్నారు. దీంతో సగటున ప్రతిరోజు ఇక్కడ 30 మంది వరకు ఆపరేషన్లు చేసేస్తున్నారు. గత సోమవారం ఒక్క రోజే ఇక్కడి డాక్టర్లు రికార్డు స్థాయిలో 49 ఆపరేషన్లు చేయడం గమనార్హం. ఇలా గతేడాది మొత్తంగా 7,212 సర్జరీలు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 2 వేలకు పైగా ఆపరేషన్లు చేశారు. పైసా ఖర్చు లేకుండా బెస్ట్ ట్రీట్మెంట్ అందుతుండటంతో జనాలు ఇక్కడికి క్యూ కడుతుండగా, అదే తీరుగా ఇక్కడి వైద్యులు సర్జరీలు చేసి రోగుల జీవితాల్లో వెలుగులు నింపుతుండటం విశేషం.
ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ సేవలందిస్తున్నం..
కంటి సమస్యలకు ప్రైవేటులో ట్రీట్మెంట్ తీసుకుంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే రీజినల్ ఐ హాస్పిటల్ లో పైసా ఖర్చు లేకుండా బెస్ట్ ట్రీట్మెంట్ అందిస్తున్నం. ఎప్పటికప్పుడు పేషెంట్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ సేవలందిస్తున్నం. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే పరిష్కరిస్తున్నాం. కంటి సమస్యలున్న ఎవరైనా రీజినల్ ఐ హాస్పిటల్ సేవలను వినియోగించుకోవాలి.
- డా.భరత్ కుమార్, సూపరింటెండెంట్, వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్
