
- కమిషనరేట్ లో ఇన్నాళ్లు నామ్ కే వాస్తేగా వీపీవో వ్యవస్థ
- క్షేత్రస్థాయిలో నిఘా కరువై పెరుగుతున్న నేరాలు
- క్రైమ్ కంట్రోల్ పై దృష్టి పెట్టిన పోలీసులు
- ఒక్కో ఊరి బాధ్యతలు కానిస్టేబుళ్లకు అప్పగింత
హనుమకొండ, వెలుగు: గతంలో గ్రామస్థాయిలో నేరాల నియంత్రణతోపాటు సమస్యల పరిష్కారానికి పని చేసిన విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ కొన్నాళ్లూ సైలెంట్ అయిపోయింది. దీంతో గ్రామాల్లో పర్యవేక్షణ కొరవడి గంజాయి, ఇతర డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది. మద్యం కూడా 24 గంటల పాటు దొరుకుతుండటంతో ఆ మత్తులో హత్యలు, దాడులు, దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు వరంగల్ పోలీస్ బాస్ సన్ ప్రీత్ సింగ్ 'విలేజ్ పోలీస్ ఆఫీసర్' వ్యవస్థను మళ్లీ స్ట్రెంథెన్ చేస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని ఒక్కో గ్రామానికి ఒక్కో కానిస్టేబుల్ ను వీపీవోగా నియమించి క్రైమ్ కంట్రోల్ తోపాటు ప్రజలతో సత్సంబంధాలు పెంచుకునేలా చర్యలు చేపడుతున్నారు.
గాడితప్పి పెరుగుతున్న నేరాలు..
వరంగల్ కమిషనరేట్ లో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలున్నాయి. ఈ మూడు జిల్లాల్లో 39 మండలాలు, 526 గ్రామాలు, 23,65,711కుపైగా జనాభా ఉంది. కమిషనరేట్ లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఈస్ట్, సెంట్రల్, వెస్ట్ జోన్ల పరిధిలోని 9 డివిజన్లలో 46 లా అండ్ ఆర్డర్, 3 ట్రాఫిక్, 2 విమెన్ పోలీస్ స్టేషన్లు, 4 వేల వరకు పోలీస్ సిబ్బంది ఉన్నారు. కాగా, గతంలో గ్రామస్థాయిలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ ఉండేది. ఊర్లల్లో జరిగిగే ఘటనలు, మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల కట్టడికి చర్యలు చేపట్టేవారు.
కొంతకాలంగా ఈ విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ నిర్వీర్యమైంది. దీంతో క్షేత్రస్థాయి పరిస్థితులపై నిఘా కొరవడి వరంగల్ కమిషనరేట్ లో ఏటికేడు నేరాలు పెరిగిపోతున్నాయి. 24 గంటలూ మద్యం దొరుకుతోంది. గంజాయి, ఇతర డ్రగ్స్ గ్రామాల్లోకి చేరుతున్నాయి. ఆ మత్తులో హత్యలు, దాడులు, దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. సరైన పెట్రోలింగ్ లేక దొంగతనాలు కూడా పెరిగిపోతున్నాయి.
వీపీవో వ్యవస్థకు మళ్లీ జీవం..
వరంగల్ కమిషనరేట్ లో పెరుగుతున్న నేరాలపై పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. సైలెంట్ మోడ్ లో ఉన్న వీపీవో సిస్టంను మళ్లీ స్ట్రెంథెన్ చేసేందుకు చర్యలు చేపట్టారు. డ్రగ్స్, క్రైమ్ కంట్రోల్ కు గ్రామానికో పోలీస్ ఆఫీసర్ ను నియమించాల్సిందిగా ఆదేశాలిచ్చారు. దీంతో స్టేషన్లవారీగా కమిషనరేట్ లోని 526 గ్రామాలకు మళ్లీ కొత్త వీపీవోలను నియమిస్తున్నారు. అర్బన్ ఏరియాల్లో కూడా ఒక్కోచోట ఇద్దరు కానిస్టేబుళ్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఆయా గ్రామాల్లోని మెయిన్ సెంటర్లు, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్ల ఫోన్ నెంబర్లతోపాటు సంబంధిత స్టేషన్ ఎస్సై, సీఐల ఫోన్ నెంబర్లు కూడా రాయిస్తున్నారు. వాల్ పోస్టర్లు ప్రింట్ చేసి, జంక్షన్లలో అతికిస్తున్నారు. వీపీవో సిస్టం, ఫోన్ నెంబర్లపై విస్తృత ప్రచారం జరిగేలా చర్యలు చేపడుతున్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే పోలీసు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షించేలా వీపీవోల జాబితాను కమిషనరేట్ లోనూ అందుబాటులో పెట్టారు.
డ్రగ్స్, క్రైమ్ కంట్రోల్ బాధ్యతలు
విలేజ్ పోలీస్ ఆఫీసర్లకు స్థానిక సమస్యలు తెలుసుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో జరిగే నేరాల కట్టడికి చర్యలు చేపట్టే బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా వీపీవోలు తమకు కేటాయించిన గ్రామాన్ని ప్రతిరోజు విజిట్ చేయాల్సి ఉంటుంది. గ్రామంలోని పరిస్థితులపై సాయంత్రం స్టేషన్ లో తమకు కేటాయించిన రిజిస్టర్ లో రాసి సంతకాలు చేయాల్సి ఉంటుంది. కమిషనరేట్ లో చాలాచోట్ల మద్యం, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి పోలీస్ ఆఫీసర్లు ముందుగా వాటిపై ఫోకస్ పెట్టారు.
గంజాయి లాంటి మాదక ద్రవ్యాల క్రయవిక్రయాలు జరిపే వ్యక్తులపై నిఘా పెంచి, వాటిని సమూలంగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ కు బానిసలైనవారిని పునరావాస కేంద్రాలకు తరలించే బాధ్యతలు కూడా వీపీవోలకు అప్పగించారు. కొన్ని స్కూళ్లు, కాలేజీల వద్ద ఈవ్ టీజింగ్ జరుగుతుండగా అలాంటి చోట్ల పోలీసులు మఫ్తీలో ఉండి ఆకతాయిల ఆట కట్టించేలా యాక్షన్ తీసుకుంటున్నారు. పోలీస్ వ్యవస్థపై నమ్మకం పెరిగేలా ప్రజలతో సఖ్యతగా వ్యవహరించడం, వృద్ధులు, మహిళలకు మనోధైర్యాన్ని కల్పించడంతో కమిషనరేట్ కు ఉన్న ఎవర్ విక్టోరియస్ పేరును నిలిపేలా చర్యలు చేపడుతున్నారు.
వీపీవోలకే గ్రామాల బాధ్యతలు
గ్రామాల్లో స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడంతోపాటు నేరాల నియంత్రణకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను మళ్లీ స్ట్రెంథెన్ చేస్తున్నాం. ఒక స్టేషన్ కు సీఐ, ఎస్సై ఎస్ హెచ్వోలుగా వ్యవహరించినట్టే వీపీవోలు తమకు కేటాయించిన గ్రామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో క్షేత్రస్థాయిలో క్రైమ్ కంట్రోల్ చేయడంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. - పింగళి ప్రశాంత్ రెడ్డి, ఏసీపీ, కాజీపేట