ఓరుగల్లు జూలో.. జంతువులు గజగజ!..వణుకుతున్న చిలుకలు, నెమళ్లు

ఓరుగల్లు జూలో.. జంతువులు గజగజ!..వణుకుతున్న చిలుకలు, నెమళ్లు
  • ఎండ వస్తే తప్ప ఎన్​క్లోజర్  దాటని పులులు, గుడ్డెలుగులు
  • కాకతీయ జూ పార్కులో కనిపించని ‘వింటర్  కేర్’
  • హైదరాబాద్  నెహ్రూ జూ పార్కులో ఆఫీసర్ల ముందస్తు చర్యలు

వరంగల్, వెలుగు:ఓరుగల్లులోని కాకతీయ జూపార్కులో చిలుకలు, నెమళ్లు, చిన్ని పక్షులు చలికి వణికిపోతున్నాయి. రెండు వారాల కింద మొంథా తుఫాన్‍  ధాటికి అల్లాడిన మూగజీవాలు, ప్రస్తుతం చలికి తల్లడిల్లుతున్నాయి. గతంలో చలికాలం రాక ముందే అవసరమైన చర్యలు తీసుకున్న జూ అధికారులు ఈసారి ఆ తరహాలో ఏర్పాట్లు చేయలేదు.

వణికిస్తున్న చలి.. మంచు..

కాకతీయ జూపార్క్​లో ప్రస్తుతం పులులు, జింకలు, దుప్పులు వంటి క్షీరదాలు(మమ్మల్స్) 134, సరీసృపాలకు(రెప్టైల్స్) చెందిన మొసళ్లు, తాబేళ్లు, ఊసరవెల్లి వంటివి 89, నెమళ్లు, రంగురంగుల చిలుకలు, అడవి కోళ్లు, లవ్‍ బర్డ్స్​ వంటి 196 పక్షులు పర్యాటకులను అలరిస్తున్నాయి.

హనుమకొండ హంటర్  రోడ్‍లోని జూపార్క్  దట్టమైన పచ్చని చెట్లతో అడవిని తలపిస్తోంది. ఉదయానికి ముందు, సాయంత్రం తర్వాత ఒక్కసారిగా ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. తీవ్రమైన మంచు పడుతోంది. బయటి ప్రాంతం కంటే.. పార్కులో 2 నుంచి 3 డిగ్రీల ఉష్టోగ్రత తక్కువగా ఉంటోంది. దీంతో మిగతా సమయాల్లో సిటీ వాతావరణానికి అలవాటు పడ్డ పార్కులోని వన్యప్రాణులు ఇప్పుడు గజగజ వణుకుతున్నాయి.జూపార్కులో ఉన్న 419 మూగజీవాలు ఉదయం 9 గంటలు దాటిన తరువాత సూర్యుడు వస్తే తప్ప ఎన్‍క్లోజర్​ దాటి బయటకు రావట్లేదు. సాయంత్రం 5 గంటలకే లోపలకు వెళ్తున్నాయి. రామ చిలుకలు, వివిధ రకాల పక్షులు, నెమళ్లు గూడు దాటడం లేదు.  

చినిగిన గ్రీన్‍ మ్యాట్స్.. కొట్టుకుపోయిన ఇసుక..

వరంగల్‍ కాకతీయ జూపార్కులోని మూగజీవాల రక్షణ కోసం అధికారులు గతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా..ఈసారి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చలికాలంలో అదనపు ఏర్పాట్ల మాటేమోగానీ మొన్నటి తుఫాన్‍ ఎఫెక్ట్ తో చాలా ఎన్‍క్లోజర్ల వద్ద గ్రీన్‍ మ్యాట్లు చినిగిపోయాయి.

మొసళ్లు, తాబేళ్లకు ఈ సీజన్‍లో వెచ్చదనం కోసం పెద్ద మొత్తంలో కొత్త ఇసుక ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ చర్యలు లేవు. ఇదిలాఉంటే మొన్నటి వరదలకు ఉన్న ఇసుక కొట్టుకుపోయింది. దీంతో పులులు, గుడ్డెలుగులు, లెపార్డ్, జంగిల్‍ క్యాట్‍, ఆస్ట్రిచ్‍ పక్షులు, చిలుకలు, పక్షులు చలిని తట్టుకోలేకపోతున్నాయి.

నెహ్రూ జూపార్కులో వింటర్‍ కేర్‍.. 

హైదరాబాద్​లోని నెహ్రూ జూలజికల్‍ పార్కులో పక్షుల నుంచి పెద్ద పులుల వరకు మూగజీవాల సంరక్షణ కోసం అక్కడి జూ అధికారులు ముందస్తుగా 'వింటర్‍ కేర్‍' చర్యలు తీసుకున్నారు. పులులు, సింహాలు, గుడ్డెలుగు వంటి మృగాలకు వెచ్చదనం కోసం హీటర్లు పెట్టారు.

రాత్రి సమయాల్లో దోమల బెడద లేకుండా వేపాకులతో పొగ పెడుతున్నారు. చిలుకలు, పక్షులకు ఇన్సులేషన్‍ మెటిరీయల్‍తో కూడిన గూడు పెట్టెలను అందుబాటులో ఉంచారు. ఇవేగాక బీ కాంప్లెక్స్, కాల్షియం సప్లిమెంట్లను నీటిలో కలిపి ఇస్తున్నారు. ఇప్పటికైనా నెహ్రూ జూపార్క్​ మాదిరిగా వరంగల్​లోని కాకతీయ జూ పార్క్​లోనూ వన్యప్రాణులకు ఏర్పాట్లు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.