నర్సంపేటకు నాలుగు లైన్ల రోడ్డు..వరంగల్ సిటీ నుంచి 40 కిలోమీటర్ల రహదారి

నర్సంపేటకు నాలుగు లైన్ల రోడ్డు..వరంగల్ సిటీ నుంచి 40 కిలోమీటర్ల రహదారి
  •     రూ.165 కోట్లతో రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్
  •     ఇక మహబూబాబాద్, ఖమ్మం వెళ్లే వారికి ప్రయాణం సాఫీ​​ 
  •     ఈ నెల 5న నర్సంపేటకు సీఎం రేవంత్​రెడ్డి 

వరంగల్/ నర్సంపేట, వెలుగు:  గ్రేటర్​ వరంగల్​ చుట్టూరా మరో ఫోర్​లైన్​రోడ్డుకు అడుగులు పడుతున్నాయి. వరంగల్​ జిల్లా హెడ్​క్వార్టర్​ నుంచి నర్సంపేటకు నాలుగు లైన్లతో రోడ్డు నిర్మించేందుకు రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఇదే విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రకటించగా, ఈ నెల 5న సీఎం రేవంత్​రెడ్డి నర్సంపేటకు రానున్నారు. వందల కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

24 గంటలు ఫుల్ ​ట్రాఫిక్

గ్రేటర్​ వరంగల్​ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే మెయిన్​రోడ్లతో పోలిస్తే, వరంగల్​ కేంద్రం నుంచి నర్సంపేట వెళ్లే రోడ్డులో 24 గంటలు ఫుల్​ ట్రాఫిక్​ ఉంటుంది. సిటీ జనాలతోపాటు కరీంనగర్​ వైపు నుంచి వచ్చే వేలాది మంది ప్రయాణికులు వరంగల్, నర్సంపేట మీదుగా ఖమ్మం, మహబూబాబాద్​ వెళ్తుంటారు. వివిధ మండలాల నుంచి ఏనుమాముల మార్కెట్​కు ఇదే మార్గంలో ప్రయాణిస్తున్నారు. పాకాల సరస్సుకు వెళ్లే టూరిస్టులు, కొమ్మాల, గుంజేడు ముసలమ్మ వంటి జాతరలకు వెళ్లే భక్తులు సైతం ఇదే రోడ్డులో జర్నీ చేయాల్సి ఉంటుంది.

 మండలాల పరిధి చూస్తే.. ఖిలా వరంగల్, గీసుగొండ, సంగెం, దుగ్గొండి, నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపూర్, చెన్నారావుపేట, నెక్కొండ వంటి మండలాల జనాలు సిటీ వెళ్లడానికి నర్సంపేట రోడ్డునే ప్రధానంగా ఉంది. దీనికితోడు గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో కాకతీయ మెగా టెక్స్​టైల్​ పార్క్​ రావడంతో ప్రముఖులు, రాబోయే రోజుల్లో ఉద్యోగులు సైతం ఇదే మార్గంలో వెళ్లాల్సి ఉంది. కాగా, వరంగల్​ నుంచి నర్సంపేట వైపు వెళ్లే క్రమంలో వరంగల్​ వెంకట్రామయ్య థియేటర్​ నుంచి గీసుగొండ జంక్షన్​ వరకు దాదాపు 15 కిలోమీటర్లు ట్రాఫిక్​ సమస్య తప్పడంలేదు.  

40 కిలోమీటర్లు 4 లైన్లు, రూ.165 కోట్లు..

వరంగల్​ హెడ్​ క్వార్టర్​ నుంచి నర్సంపేటకు దాదాపు 40 కిలోమీటర్లు ఉండగా, రాష్ర్ట ప్రభుత్వం ప్రజల డిమాండ్​ ను దృష్టిలో పెట్టుకుని 4 లైన్ల మెయిన్​రోడ్ నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.165 కోట్లు కేటాయించినట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. 

పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా నాలుగు లైన్లుగా రోడ్డును విస్తరించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉన్నా, సమైక్య రాష్ట్రంతో పాటు కొత్త రాష్ట్రం వచ్చాక 10 ఏండ్ల బీఆర్​ఎస్​ ప్రభుత్వం సైతం దీనిని పట్టించుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుండడంతో నర్సంపేటతో పాటు పరకాల నియోజకవర్గ జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నర్సంపేటకు సీఎం రేవంత్​రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేండ్ల తర్వాత సీఎం రేవంత్​రెడ్డి తొలిసారి ఈ నెల 5న నర్సంపేట నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇటీవలె నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలతో సీఎం రేవంత్​రెడ్డిని కలిసి నర్సంపేట పర్యటనకు ఆహ్వానించారు. దీంతో ఎల్లుండి సీఎం ఇక్కడకు రానున్నారు. 

ఈ సందర్భంగా రూ.1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు ప్రకటనలు ఉంటాయని ఎమ్మెల్యే దొంతి మీడియాకు తెలిపారు. ఇందులో ప్రధానంగా వరంగల్ 4 లైన్ల రోడ్డు విస్తరణతో పాటు రూ.150 కోట్లతో మెడికల్​ కాలేజీ బిల్డింగ్, రూ.200 కోట్లతో నర్సంపేటలో ఇంటిగ్రేటెడ్​ స్కూల్, రూ.45 కోట్లతో నర్సింగ్​ కాలేజీ, రూ.20 కోట్లతో సైడ్​ డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.