గుండెపోటుతో వార్డుబాయ్ మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

గుండెపోటుతో వార్డుబాయ్ మృతి.. కుటుంబ సభ్యుల ఆందోళన

సిద్దిపేట రూరల్, వెలుగు : ఓ ప్రైవేట్  హాస్పిటల్ లో వార్డుబాయ్ గా పనిచేసే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. పరిహారం కోసం హాస్పిటల్ లో ముందు అతని కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. ఈ ఘటన సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగింది. సిద్దిపేట జిల్లాలోని నారాయణరావుపేట మండల కేంద్రానికి చెందిన పల్నాటి భిక్షపతి (60) ఎనిమిదేండ్లుగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వార్డుబాయ్ గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం విధులకు హాజరైన భిక్షపతి.. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

భిక్షపతి కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే ఆయన మృతిచెందాడని తెలుసుకుని మృతదేహంతో ఆయన పనిచేసే ప్రైవేటు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. దీంతో  రూ.10 వేలు ఇస్తామని ఆస్పత్రి నిర్వాహకులు చెప్పగా ఏళ్ల తరబడి పనిచేస్తున్నా నామమాత్రంగా సాయం చేస్తామని చెప్పటం తగదని నిరసన కొనసాగించారు. దీంతో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు అక్కడికి చేరుకుని డాక్టర్ తో మాట్లాడారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన విరమించి మృతదేహాన్ని తీసుకెళ్లారు.