తమ ఓటు తామే వేసుకోని వార్డు మెంబర్లు

తమ ఓటు తామే వేసుకోని వార్డు మెంబర్లు

వీళ్లకు ఒక్క ఓటూ పడలె

కొంత మంది వాళ్లకు వాళ్లే ఓటు వేసుకోలే

పోటీ చేసిన వార్డుల్లో కాక వేరే వార్డుల్లో ఓటు

వెలుగు నెట్ వర్క్: మున్సిపల్‌‌‌‌ ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు క్యాండిడేట్లకు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా పడలేదు. వార్డులోని ఓటర్లు ఓటేయడం సంగతి పక్కన పెడితే తమ ఓటు కూడా తాము వేసుకోలేదు. వేరే వార్డుల్లో ఓటుండటంతోనే ఈ పరిస్థితి వచ్చింది. ఇంకొందరేమో ఎలాగూ ఓడిపోతామని తెలిసి వేరే వాళ్లకు ఓటేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాల్టీలో 8వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కొత్త పద్మ, 4వ వార్డు నుంచి పోటీ చేసిన కేతిరి రాజయ్యకు ఒక్క ఓటూ రాలేదు. సంగారెడ్డి మున్సిపాల్టీలో ఇండిపెండెంట్లుగా పోటీచేసిన నలుగురిదీ అదే పరిస్థితి. 20వ వార్డు నుంచి పోటీ చేసిన మహ్మద్​ ఓవైస్, మిర్దొడ్డి చంద్రశేఖర్,  21వ వార్డు నుంచి బరిలో నిలిచిన షేక్ వాజీద్​ రియాజ్, 26వ వార్డునుంచి పోటీ చేసిన మహ్మద్​ ఆసిఫ్‌కు ఓటే పడలేదు. వీరు ప్రచారంలో ప్రధాన పార్టీలతో పోటీపడినా, తమ ఓటు తాము వేసుకోలేకపోయారు. ఇల్లందు మున్సిపాల్టీలోని 11వ వార్డులో సీపీఐ నుంచి బరిలో నిలిచిన కొడెం విజయకు కూడా ఒక్క ఓటు రాలేదు.

జనగామ టౌన్​లో 15వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్తపల్లి సమ్మయ్య, ఇండిపెండెంట్స్​గా 1వ వార్డు నుంచి బరిలో ఉన్న మెటె రేణుక, 7వవార్డు నుంచి ఆకుల సతీష్, మహ్మద్ జహిరుద్దీన్ ,10వ వార్డు నుంచి భూక్యలక్ష్మి, 17వ వార్డు నుంచి మచ్చ సుచరిత, 24వ వార్డు నుంచి సానబోయిన లక్ష్మి, 28వ వార్డు నుంచి పోటీ చేసిన మహేశ్వరం జయప్రకాష్, 29వ వార్డు నుంచి రంగంలో ఉన్నమహ్మద్​ మోహినోద్దీన్​కు ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాల్టీలోని 1వవార్డు నుంచి పోటీ చేసిన ఇండిపెండెంట్‌‌‌‌ అభ్యర్థి మేడి నరేష్, 2వ వార్డు నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కోనేటి లక్ష్మమ్మ, 12వ వార్డు నుంచి బరిలో నిలిచిన టీజేఎస్ అభ్యర్థి కొవ్వూరి మదనగోపాల్‌‌‌‌కు ఒక్క ఓటు పడలేదు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాల్టీలో స్వతంత్ర అభ్యర్థి మహేశ్వరికి, అయిజ మున్సిపాల్టీలో టీడీపీ అభ్యర్థి తనగల నాగరాజుకు, కొల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మున్సిపాల్టీలో 3వ వార్డు నుంచి పోటీ చేసిన కె.కృష్ణయ్య, జీఎం యాదవ్‌కు ఒక్క ఓటు కూడా పోల్‌‌‌‌ అవ్వలేదు. కొందరు తాము ఎలాగో ఓడిపోతామని తెలిసి ఇతరులకు ఓటేస్తే మరికొందరి ఓటు చెల్లకపోవడంతో ఈ పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకొందరికి వేరే వార్డుల్లో ఓట్లు ఉండటంతో పోటీచేసిన చోట ఓటు వేసుకోలేకపోయారు. గద్వాలలోని తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీనివాసులుకు ఒకే ఒక్క ఓటు పడింది.

For More News..

స్మార్ట్‌ ఫోన్ల వాడకంలో అమెరికాను దాటిన భారత్