ఆగం చేసిన వాన ..భారీ వర్షంతో తడిసిన ధాన్యం ..కొనుగోలు సెంటర్లలో కొట్టుకుపోయిన వడ్లు

ఆగం చేసిన వాన ..భారీ వర్షంతో తడిసిన ధాన్యం ..కొనుగోలు సెంటర్లలో కొట్టుకుపోయిన వడ్లు
  • లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు

జనగామ/మహబూబాబాద్/యాదాద్రి, వెలుగు: భారీ వర్షం రైతులను ఆగం చేసింది. జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లో సోమవారం ఉదయం ఒక్కసారిగా వర్షం కురవడంతో కొనుగోలు సెంటర్లలో ఆరబెట్టిన వడ్లు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల వడ్లు తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

జనగామ మార్కెట్​ యార్డులో 2 వేల బస్తాల వడ్లు తడిసినట్లు రైతులు తెలిపారు. యార్డులో ప్రభుత్వం రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వడ్లు ఆరబోసుకోవడానికి అనువుగా ఉండడంతో పలువురు రైతులు తమ వడ్లను మార్కెట్​కు తెచ్చి ఆరబోసుకున్నారు. 

మొక్కజొన్న కుప్పలు కూడా తడిసిపోయాయి. రఘునాథపల్లి, బచ్చన్నపేట, లింగాల ఘన్​పూర్, పాలకుర్తి మండలాల్లో వాన కురిసింది. కోతకు వచ్చిన వరి పొలాలు, ఆరబోసిన ధాన్యం తడిసిపోయాయి.
 
లోతట్టు ప్రాంతాలు జలమయం..

మహబూబాబాద్​ జిల్లాలో  సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా కురిసిన బారీ వర్షంతో పాలేరు, మున్నేరు, పాకాల వాగులు ఉప్పొంగాయి, కొత్తగూడలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గంగారం, ఓటాయి వైపు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. 

గుంజేడు తోగు, గాదేవాగులు పొంగి ప్రవహించడంతో నర్సంపేట వైపు, గార్ల సమీపంలోని పాకాలవాగు ఉప్పొంగడంతో ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నర్సంపేటకు గుంజేడు మీదుగా వెళ్తున్నారు. కొత్తగూడ మండలంలో అత్యధికంగా 91.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్నలు తడిసిముద్దయ్యాయి. తడిసిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

యాదాద్రి జిల్లాలో అపార నష్టం..

యాదాద్రి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.  జిల్లాలోని చౌటుప్పల్, వలిగొండ, మోత్కూరు, ఆత్మకూరు(ఎం)తో పాటు పలు మండలాల్లో వర్షం దంచి కొట్టింది. నీటి ప్రవాహంతో పలు చోట్ల ఆరబోసుకున్న వడ్లు కొట్టుకుపోయాయి. కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్లను రైతులు కుప్పలు పోసుకోవడానికి తిప్పలు పడ్డారు. జిల్లాలో 4.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

చౌటుప్పల్  నక్కలగూడెంలో వరద నీరు పౌల్ట్రీ ఫారంలోకి చేరడంతో 6 వేల కోళ్లు చనిపోయాయి. 2 గంటల వ్యవధిలో వలిగొండలో రికార్డు స్థాయిలో 19 సెంటీమీటర్లు, ఆత్మకూరు(ఎం)లో 13, మోత్కూరులో 12, రామన్నపేటలో 6, గుండాల, అడ్డగూడూరులో 5, పోచంపల్లి, చౌటుప్పల్, నారాయణపురం, యాదగిగుట్టలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.